| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం

డైలీ భారత్, కామా రెడ్డి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నిరంతర పర్యవేక్షణ తో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కామారెడ్డి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా విశిష్ట ప్రగతిని నమోదు చేసింది. పేదలకు గృహ కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది.

జిల్లాలో మొత్తం 12,090 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, వాటిలో 10,945 ఇళ్లు (90.52 శాతం) గ్రౌండింగ్ పూర్తి అయ్యాయి. ఇప్పటికే లబ్ధిదారులకు రూ.238.77 కోట్లు విడుదల చేయగా, నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

గ్రౌండింగ్ పూర్తయిన ఇళ్లలో 6,077 ఇళ్ల నిర్మాణాలు పైకప్పు స్థాయికి చేరుకోగా, మరిన్ని ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణాలను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది.

అదేవిధంగా, పథకం కింద 2,365 మంది లబ్ధిదారులకు రూ.31.97 కోట్లు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందజేయగా, బ్యాంకుల సహకారంతో మరింత మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే చర్యలు కొనసాగుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల ఫేజ్–2 అమలుకు సంబంధించి జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. అర్హులైన పేద కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కామారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

Previous స్ప్రింగ్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు
Next 40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ
ADVERTISEMENT