డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జాతీయ సామాజిక సేవా వారోత్సవం – 2025 లో భాగంగా కాకతీయ యూనివర్సిటీ సామాజిక శాస్త్రం మరియు సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రత్యేక వెబినార్ నిర్వహించబడింది.
ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ సోషల్ వర్క్ విద్యార్థులకు “ఆత్మహత్య నివారణ పద్ధతులు” అనే అంశంపై ఆన్‌లైన్‌లో మార్గదర్శనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రస్తుతం సమాజంలో యువతలో ఆత్మహత్యా ప్రవర్తన పెరుగుతున్నదని, దీనిని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలని తెలిపారు.
కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే అనేక ప్రాణాలను రక్షించవచ్చని సూచించారు.
ఆత్మహత్య ముందుగానే గుర్తించే సూచనలు వివరిస్తూ..
తరచూ “నేను బతకడం అవసరం లేదనిపిస్తోంది”, “నేను లేకపోతే బాగుంటుంది” వంటి మాటలు మాట్లాడుతారని అన్నారు.
సామాజిక సంబంధాల నుండి దూరమవడం, ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడటం, నిద్ర, ఆహారపు అలవాట్లలో అకస్మాత్తుగా మార్పులు రావడం, చదువు, పని పట్ల ఆసక్తి కోల్పోవడం, తీవ్ర నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ భావాలను వ్యక్తపరచడం, మందులు, మద్యం లేదా హానికర పదార్థాల వినియోగం పెరగడం, స్వీయహానికర ప్రవర్తన సంకేతాలు వ్యక్తుల్లో కనిపిస్తాయని అన్నారు.
ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వెంటనే స్పందించి కౌన్సెలింగ్ లేదా నిపుణుల సహాయం తీసుకోవడం అత్యవసరం అని పున్నం చందర్ తెలిపారు.
అలాగే భవిష్యత్తులో సోషల్ వర్క్ విద్యార్థులు సమాజంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సేవలు, సహాయక వాతావరణం సృష్టించడం వంటి బాధ్యతలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విభాగాధిపతి ప్రొఫెసర్ యం. స్వర్ణలత మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకు సమస్యలతో పాటు సోషల్ వర్క్ యొక్క ప్రాధాన్యత పెరుగుతున్నదని అన్నారు.సామాజిక శాస్త్రం, సంఘ సంక్షేమ శాస్త్రం బోర్డు ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ యం. ఐలయ్య, అధ్యాపకులు డాక్టర్ కె. సుభాష్, డాక్టర్ యస్. సాహితి మరియు పరిశోధక విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో సోషల్ వర్క్ విద్యార్థులు పాల్గొన్నారు.