Posted on 2025-07-02 12:08:17
30 ఏళ్లుగా పరారీలో - రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
రాయచోటిలో చిక్కిన ఇద్దరు ఉగ్రవాదులు - 30 ఏళ్లుగా తప్పించుకుంటూ రాయచోటిలోనే మకాం
డైలీ భారత్, రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నారనే సమాచారం బయటికి పొక్కడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ తెరవెనక భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది.
ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ రథయాత్ర సందర్భంగా మధురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు. రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబులను నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని చింతాద్రిపేట హిందూమున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు.
అదే ఏడాది పార్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాల్లో వరసగా ఏడు చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరూ ప్రధాన నిందితులు. 2012లో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ అరవిందరెడ్డిని హత్య చేయడంలోనూ వీరిపై కేసులు ఉన్నాయి. 2013లో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. 1999లో తమిళనాడు, కేరళలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిన ఘటనలో వీరిపై అభియోగాలున్నాయి.
సోదరులిద్దరిపై తమిళనాడులో పది వరకు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కోట్ల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. తమిళనాడు నుంచి తప్పించుకుని వచ్చిన తీవ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ ఎవరికి అనుమానం రాకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకొని అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ చీరల వ్యాపారం చేస్తున్నారు.
అయితే తెరవెనక తీవ్రవాద చర్యలు బలంగానే చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు గుర్తించాయి. రాయచోటిలో ఉన్నారని ఐబీ పక్కా సమాచారం సేకరించింది. వారిని పట్టుకోవడానికి ఐబీ అధికారులు రెండు నెలల నుంచి రాయచోటిలో మకాం వేశారు. మారువేషాలతో తిరుగుతూ, చిరుతిండ్లు విక్రయిస్తూ ఉగ్రవాదుల కదలికలు, వారి ఇళ్లపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు నిందితుల ఇళ్లను గుర్తించి స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు.
వీరి ఇళ్లలో పోలీసులు, ఐబీ అధికారులు తనిఖీలు చేయగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పుస్తకాలు, మందుగుండు సామగ్రి లభ్యమైనట్లు తెలిసింది. కొన్ని పేలుడు పదార్థాల సామగ్రిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించి వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >