స్వచ్ఛతను పచ్చదనం అందరి బాధ్యత : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
మున్సిపల్ కార్యాలయం ముందు మొక్కలు నాటిన ఎమ్మెల్యే శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
స్వచ్ఛదనం.. పచ్చదనం ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది, నగర పౌరులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజంలో స్వచ్ఛదనం, పచ్చదనం రెండు నిరంతర ప్రక్రియాలని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. అదేవిధంగా స్వచ్ఛతనం.. పచ్చదనం కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని ఇది ప్రజలందరి బాధ్యత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. వీరు ఇరువురు స్వచ్ఛధనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ చీమ వెంకన్న సారధ్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం ఐదు రోజుల కార్యక్రమానికి ప్రారంభోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, సిడిపిఓ నాగమణి, స్థానిక కౌన్సిలర్లు, పట్టణ పుర ప్రముఖులు, ప్రజలు ప్రభుత్వ ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బంది హాజరయ్యారు.
ఒక మొక్క, ఇంకుడు గుంత ఉంటే ఇంటి పర్మిషన్లు సులభతరం చేయండి
మున్సిపాలిటీకి ఎమ్మెల్యే శంకర్ సూచన
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ కమిషనర్ పరస్పర అవగాహనతో పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఒక ఉద్యమంలా చేపట్టాలని అన్నారు. పారిశుద్ధ్య, పచ్చదనం, స్వచ్ఛదనం కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఇంటికి ఒక మొక్క ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుంటే ఇంటి అనుమతులు సులభతరం చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం చెప్పిందని మొక్కలు అవసరం లేని చోట నాటుకుంటూ పోతే వాటిని కొందరు తీసుకుంటూ పోతారని అలా కాకుండా అవసరమైన చోట మాత్రమే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని ప్రజలను భాగస్వాములు చేసుకుంటూ వారిని ఆలోచింపజేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రూపొందించి దానికి అనుగుణంగా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే, చైర్మన్ నరేందర్ కు సూచించారు. మాస్టర్ ప్లాన్ ద్వారా పట్టణానికి కావలసిన టౌన్ ప్లానింగ్ ఇతర అంశాలలో ప్రజలకు వివరంగా తెలియజేసి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
స్వచ్ఛదనం.. పచ్చదనం అందరి బాధ్యత
ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
స్వచ్ఛదనం పచ్చదనం అందరి బాధ్యత అని మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛతను మరియు పచ్చదనాన్ని కల్పించడం ద్వారా రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్వచ్ఛతను పచ్చదనం కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. దీనిని విజయవంతంగా అమలు చేసేందుకు గ్రామాలు పట్టణ ప్రాంతాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించాలన్నారు. మొక్కల పెంపకాన్ని గృహస్థాయిలో మరియు సామాజిక స్థాయిలో చేపట్టాలని సూచించారు. ప్రచార వ్యవధిలో చేపట్టిన కార్యకలాపాలు నిరంతర ప్రతిపాదికన ప్రచారం తర్వాత కూడా కొనసాగించాలని సూచించారు. కేవలం అధికారులు మాత్రమే ఈ కార్యక్రమాలు చేపట్టాలని భావించకూడదని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఇళ్ల వద్ద లేదా తమ కాలనీలో గురుతరంగా చేపట్టాలని సూచించారు. మంచి కార్యక్రమాలకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజా ప్రతినిధులుగా తమ తోడ్పాటు అందించడానికి ఎల్లవేళలకు సిద్ధంగా ఉంటామని అన్నారు.
మున్సిపల్ అభివృద్ధికి పాటుపడతాం - మున్సిపల్ చైర్మన్ నరేందర్
మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగే విధంగా పాటుపడతామని మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రజల అభ్యున్నతి కోసం చేపడుతుందని ఈ సందర్భంగా తమ వంతు కర్తవ్యం నెరవేర్చుతామని అన్నారు. స్వచ్ఛతను పచ్చదనం కార్యక్రమం విజయవంతం కోసం తోడ్పాటు అందించిన తన కౌన్సిల్ సభ్యులకు అదేవిధంగా మీడియా ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు పట్టణ ప్రముఖులకు అందరికీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న మాట్లాడుతూ.. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి
మున్సిపల్ కార్యాలయ వాహనాలు వచ్చినప్పుడు వాటిలో వేయాలని ఇది నిరంతర ప్రక్రియ అని ఎల్లప్పుడూ పచ్చదనం పరిశుభ్రత కొనసాగుతూనే ఉంటుందని కమిషనర్ సూచించారు. కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరిపినందుకు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ బయలుదేరి స్థానిక చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి, సిడిపిఓ నాగమణి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, మహిళా నాయకురాలు రమాదేవి, మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, చెంది తిరుపతిరెడ్డి చెన్నయ్య డంగు శ్రీనివాస్ యాదవ్, జమ్రుత్ ఖాన్, ఇబ్రహీం, కౌన్సిలర్ రాయికల్ శ్రీనివాస్, ముబారక్ అందే మోహన్, సింగారం సుదర్శన్, ఆశ వర్కర్లు, మున్సిపల్ శాఖకు సంబంధించిన ఆయా వర్గాల సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.