ప్రతిపక్ష నేతననే హింసిస్తున్నారని ప్రశ్న
ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధం
రైతు నేవురీ దేవేందర్ రెడ్డి ఆవేదన
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తాను బ్రతికుండగానే నన్ను చంపేశారని ఓ రైతు ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి దేవేందర్ రెడ్డి అనే రైతు స్థానిక కెడిసిసి బ్యాంకులో సుమారు ఐదు సంవత్సరాల క్రితం 84 వేల పంట రుణం తీసుకున్నాడు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మిత్తి కూడా కడుతున్నాడు. అయితే తాజాగా ప్రభుత్వం పంట రుణమాఫీ చేసిన జాబితాలో అతని పేరు రాలేదు. దీనిపై తన రుణమాఫీ ఎందుకు చేయలేదని బ్యాంకు వారిని అడిగితే, వ్యవసాయ శాఖ అధికారులను కలవమని చెప్పారు. వ్యవసాయ అధికారులు "లోన్ సాంక్షన్డ్ ఆఫ్టర్ డెత్" అని తమ రికార్డులో ఉందని, దేవేందర్ రెడ్డి బతికిఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. దాంతో కంగుతిన్న దేవేందర్ రెడ్డి గ్రామ పంచాయతీ నుండి తాను బతికి ఉన్నానని సర్టిఫికెట్ వ్యవసాయ అధికారులకు అందించినట్లు తెలిపాడు. దీంతో దేవేందర్ రెడ్డి శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశంలో తన గోడు విన్నవించుకున్నాడు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన వాడినని వేధిస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. అధికారులు తన రుణ మాఫీ చేయని యెడల, ఎంతటి న్యాయ పోరాటానికి ఐనా సిద్దమని తెలిపాడు