Posted on 2026-07-24 17:51:05
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికుల ఆందోళన
పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలకు డిమాండ్
చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్‌లో తీవ్ర విషాదం
డైలీ భారత్, కాస్లాబాద్ (చౌదర్‌గూడ):స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంటి వద్ద దింపి బస్సును వెనక్కి తీసే క్రమంలో చక్రాల కింద పడి యూకేజీ చదువుతున్న విద్యార్థిని దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామం లో శుక్రవారం చోటుచేసుకుంది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
కళ్లెదుటే జరిగిన ఘోరం..
గ్రామానికి చెందిన కృష్ణయ్య, మనీష దంపతుల కుమార్తె సహస్ర.. స్థానికంగా ఉన్న "అభ్యాస్ విద్యాపీఠం" పాఠశాలలో యూకేజీ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం స్కూల్ బస్సులో చిన్నారిని ఇంటి వద్దకు తీసుకువచ్చారు. బస్సు దిగిన చిన్నారి వాహనం వెనుక వైపునకు వెళ్లగా.. డ్రైవర్ గమనించకుండా ఒక్కసారిగా బస్సును వెనక్కి (రివర్స్) తీయడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడిన సహస్రను స్థానికులు హుటాహుటిన షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రోజూలాగే స్కూల్‌కు వెళ్లి నవ్వుతూ తిరిగిరావాల్సిన బిడ్డ, విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నిర్లక్ష్యంపై భగ్గుమన్న స్థానికులు..
ఈ ఘటనపై గ్రామస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యులైన స్కూల్ యాజమాన్యం, డ్రైవర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా సహాయక సిబ్బంది (అటెండర్) ఉండాలని, కానీ ఆ భద్రతా ప్రమాణాలను విద్యాసంస్థలు గాలికొదిలేశాయని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాలలపై విద్యాశాఖ, ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.
పోలీసుల దర్యాప్తు..
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, డ్రైవర్ నిర్లక్ష్యం, పాఠశాల యాజమాన్యం బాధ్యత తదితర కోణాల్లో సమగ్రంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాజా ఘటనతో పాఠశాల బస్సుల భద్రత, రవాణా వ్యవస్థపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >