| Daily భారత్
Logo




రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

News

Posted on 2026-09-06 04:04:29

Share: Share


రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

గడువు అక్టోబర్‌ 31వరకు ఉండగానే అరెస్టులా..!

విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు.. ఆకస్మిక తనిఖీలు.. అరెస్టులతో వ్యాపారస్తుల్లో భయాందోళన

రూ.118 కోట్ల బకాయిల్లో ఇప్పటికే రూ.80 కోట్లు చెల్లించాం.. మిగతాది గడువులోగా చెల్లిస్తాం

25 శాతం పెనాల్టీ.. 12 శాతం వడ్డీ మాఫీ చేయాలి — రైస్ మిల్లర్ల సంఘం డిమాండ్!

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రైస్‌మిల్ వ్యాపారులపై ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని కామారెడ్డి రైస్‌మిల్ యజమానుల సంఘం అధ్యక్షుడు పప్పుల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ దాడులు, ఆకస్మిక తనిఖీలు, అరెస్టులతో మిల్లర్లను భయాందోళనలకు గురిచేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం విధించిన గడువు ముగిసే వరకు మిల్లర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైస్‌మిల్ యజమానుల సంఘం నాయకులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

2022-23 యాసంగి టెండర్ ధాన్యానికి సంబంధించి జిల్లాలో రైస్‌మిల్ యజమానులు ప్రభుత్వానికి రూ.118 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికే రూ.80 కోట్లు చెల్లించారని అధ్యక్షుడు పప్పుల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వం విధించిన గడువు అక్టోబర్ 31వరకు ఉందని, ఆలోగా మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా చెల్లింపులు జరగకపోతే ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

"డబ్బులు రికవరీ చేసుకోండి.. అరెస్టులు ఎందుకు?"

ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను రికవరీ చేసుకోవాల్సిన ప్రభుత్వం, మిల్లర్లను అరెస్టు చేసి జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని రాజేందర్ ప్రశ్నించారు. జిల్లాలో ఇప్పటికే నలుగురు వ్యాపారులను అరెస్టు చేసి జైలుకు పంపారని, ఈ విధానం సరైంది కాదన్నారు. వ్యాపారులను స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు.

2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన సుమారు 7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రస్తుతం రైస్‌మిల్లుల్లో నిల్వ ఉందన్నారు. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 100 శాతం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించిన తర్వాతే తదుపరి సీజన్ ధాన్యాన్ని మిల్లులకు కేటాయించాలని, అప్పటివరకు ప్రభుత్వం తన వద్దే ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలని సూచించారు.

పెనాల్టీ, వడ్డీ మాఫీ చేయాలి

డిఫాల్ట్ రైస్‌మిల్లర్లపై ప్రభుత్వం విధించిన 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని మినహాయించాలని పప్పుల రాజేందర్ డిమాండ్ చేశారు. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల రా రైస్‌ను ప్రభుత్వానికి సరఫరా చేయడం సాధ్యం కాదని, ఈ అంశంపై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలను పరిశీలించాలని కోరారు. కమిటీ నివేదిక ఆధారంగా నూతన పాలసీని తీసుకురావాలని సూచించారు.

ప్రస్తుత విధానం కొనసాగితే రాష్ట్రంలోని అనేక రైస్‌మిల్లులు మూతపడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని రైస్‌మిల్ యజమానులతో సమావేశం నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

"పోలీసులను పంపకండి.. మా గౌరవాన్ని కాపాడండి"

కామారెడ్డి డివిజన్ రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు భూమేష్ గుప్తా మాట్లాడుతూ.. రైస్‌మిల్ వ్యాపారంలో ఉన్న 98 శాతం మంది ప్రభుత్వాన్ని మోసం చేయాలనే ఉద్దేశంతో లేరని స్పష్టం చేశారు. గౌరవప్రదంగా సమాజంలో తలెత్తుకొని జీవించాలనే ఉద్దేశంతో వ్యాపారం చేస్తూ రైతులకు, ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు.

“పోలీసులను పంపకండి.. మా కుటుంబాలకు ఉన్న గౌరవాన్ని తీయకండి. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఫోన్ చేస్తే వారి కార్యాలయానికి వచ్చి మాట్లాడేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా బకాయిలు చెల్లిస్తాం. అప్పటివరకు వేధింపులు, ఆకస్మిక తనిఖీలు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్  దాడులు నిలిపివేయాలి” అని ఆయన కోరారు.

మిల్లర్ల బకాయిలు వడ్డీతో సహా చెల్లించాలి

జిల్లా రైస్‌మిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలను కూడా వడ్డీ, పెనాల్టీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ రైస్‌మిల్లులను నడిపి ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వానికి మిల్లర్లు సహకరించారని గుర్తు చేశారు.

దోమకొండ డివిజన్ రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. బియ్యం గింజపై తెల్లటి మచ్చ వచ్చిన కారణంగా ఎఫ్‌సీఐ అధికారులు బియ్యాన్ని తీసుకోవడం లేదని, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని విలేకరుల సమావేశంలో చూపించారు. మిల్లుల్లో స్థలం లేకపోయినా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు ఆదేశించడంతో ఖాళీ ప్రదేశాల్లోనూ ధాన్యాన్ని దించుకొని ప్రభుత్వానికి సహకరించామని తెలిపారు.

ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షుడితో పాటు పలువురు రైస్‌మిల్ యజమానులు మాట్లాడారు. సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైస్‌మిల్ యజమానులు హాజరయ్యారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >