సింగభూపాలెం చెరువు మట్టి అక్రమ తరలింపుపై రైతుల ఆగ్రహం
అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువు నుంచి రైతుల పంట పొలాలకు తరలించాల్సిన సారవంతమైన తొలకాలు (చెరువు పూడిక మట్టి) ఇతర వ్యాపార అవసరాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చెరువు మట్టి వ్యవసాయ భూములకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పంటల దిగుబడి పెరగడానికి దోహదపడే ఈ మట్టిని రైతులకు అందించాల్సి ఉండగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్ల కోసం అక్రమంగా తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని రైతులు తీవ్రంగా ఖండిస్తూ, సహజ వనరులను వ్యాపార ప్రయోజనాలకు వినియోగించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు మట్టి తరలింపుపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని, దీని వెనుక అధికారుల లాలూచీ ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
వెంటనే అధికారులు స్పందించి చెరువు మట్టి తరలింపుపై సమగ్ర విచారణ చేపట్టి, రైతుల ప్రయోజనాలను కాపాడాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.