రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం... ఎమర్జెన్సీ వార్డులో
డైలీ భారత్, విజయవాడ: రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు.
ఆసుపత్రి ప్రాంగణంలో కేకలు, ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులను, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.