| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజల భద్రతే లక్ష్యంగా కామారెడ్డి న్యూబస్ స్టాండ్‌లో పోలీస్ కళాబృందం, షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

ప్రజల భద్రతే లక్ష్యంగా కామారెడ్డి న్యూబస్ స్టాండ్‌లో పోలీస్ కళాబృందం, షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని కా. కామారెడ్డి న్యూ బస్ స్టాండ్ వద్ద ఈ రోజు పోలీస్ కళాబృందం మరియు షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా రోడ్డు భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళల భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

సైబర్ నేరాల నివారణలో భాగంగా బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు లేదా ప్రభుత్వ సంస్థల ప్రతినిధుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డులు ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనదారులు సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

పోలీస్ కళాబృందం ఇన్‌ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి మరియు వారి బృందం పాటలు, నాటికలు, సందేశాల రూపంలో సైబర్ భద్రత, సామాజిక బాధ్యతలు, మహిళల రక్షణ మరియు రోడ్డు భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవీందర్, షీ టీమ్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ సౌజన్య, పోలీస్ కళాబృంద సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా : పోక్సో కేసులో సంచలన తీర్పు
Next ప్రభుత్వ విద్య సంస్థలలో మౌలిక వసతులు కల్పించాలి
ADVERTISEMENT