ఇద్దరు నిందితుల అరెస్ట్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిర్మాణంలో ఉన్న భవనాలకు తామే యజమానులమని నమ్మించి, రెడీమిక్స్ కాంక్రీట్ సరఫరాదారులను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు నిందితులను కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నగదుతో పాటు కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. షాద్‌నగర్‌కు చెందిన చిల్లా సూర్య ప్రతాప్ రెడ్డి రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మే 2వ తేదీన కమ్మరి రమేష్ (అలియాస్ విశాల్) అనే వ్యక్తి సూర్య ప్రతాప్ రెడ్డిని సంప్రదించి, కొత్తూరులో తనకు ఓ భవనం ఉందని, దానికి కాంక్రీట్ కావాలని కోరాడు. తాను ఆ భవన యజమానినని నమ్మించిన విశాల్, రూ. 50,000 అడ్వాన్స్ చెల్లించి కాంక్రీట్ ఆర్డర్ ఇచ్చాడు. మిగిలిన రూ. 4,23,500 పని పూర్తయ్యాక ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
తీరా పని పూర్తయ్యాక, డబ్బులు అడగగా బ్యాంకు ద్వారా బదిలీ చేస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అనుమానం వచ్చిన బాధితుడు భవనం వద్దకు వెళ్లి విచారించగా, విశాల్ ఆ భవన యజమాని కాదని, అసలు యజమాని నుండి విశాల్ అప్పటికే కాంక్రీట్ పనికి సంబంధించిన పూర్తి డబ్బును వసూలు చేసుకున్నాడని తెలిసి నిర్ఘాంతపోయాడు.
నిందితులు కమ్మరి రమేష్ (A1) మరియు వేముల ప్రేమ్ కుమార్ (A2) కలిసి పథకం ప్రకారం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లను గుర్తించేవారు. తామే యజమానులమని అబద్ధం చెప్పి రెడీమిక్స్ సరఫరాదారులను సంప్రదించేవారు. అడ్వాన్స్ ఇచ్చి కాంక్రీట్ వేయించేవారు. అనంతరం అసలు యజమానుల నుండి డబ్బులు వసూలు చేసుకుని, సరఫరాదారులకు మాత్రం చెల్లించకుండా పరారయ్యేవారు.
ఇదే తరహాలో వీరు చేవెళ్ల, గజ్వేల్, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి ప్రాంతాల్లో సుమారు రూ. 16,50,000 వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మే 8వ తేదీన ఇన్ముల్నర్వ గ్రామంలో మరో మోసానికి రెడీ అవుతుండగా, కొత్తూరు పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుండి
రూ.2,39,500 నగదు ఎర్టిగా కారు (TS-29-G-6888) ఒక ఐఫోన్ సహా మొత్తం 4 స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, రంగారెడ్డి జిల్లా పరిధిలో షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో, కొత్తూరు ఇన్‌స్పెక్టర్ జి. నర్సయ్య మరియు సిబ్బంది ఈ కేసును ఛేదించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీహెచ్. శిరీష అభినందించారు.