Posted on 2026-05-08 19:15:06
వ్యాస కర్త: ప్రముఖ సైకాలజిస్ట్,
TPA రాష్ట్ర ఉపాధ్యకుడు
(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
"పిల్లల మనస్థత్వం – సమస్యలు, పరిష్కారాలు"
డైలీ భారత్ స్పెషల్: ఈరోజుల్లో పిల్లల జీవితం ఎన్నో మార్పులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పిల్లలు ఉమ్మడి కుటుంబాల్లో పెరిగి ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం, సహనం వంటి విలువలను సహజంగానే నేర్చుకునేవారు. కానీ ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవనశైలి, చిన్న కుటుంబ వ్యవస్థ, విద్యా ఒత్తిడి, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం, తల్లిదండ్రుల బిజీ జీవితం వంటి అనేక కారణాలు పిల్లల మనస్తత్వాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
పిల్లలు బయటకు నవ్వుతూ కనిపించినా, వారి అంతర్మనస్సులో భయాలు, ఒత్తిడులు, ఆందోళనలు, ఒంటరితనం, ఆత్మన్యూనతాభావం వంటి అనేక భావోద్వేగ సమస్యలు దాగి వుంటున్నాయి. అందువల్ల పిల్లల మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడం ఈరోజు సమాజానికి అత్యంత అవసరంగా మారింది.
పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కుటుంబం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రుల ప్రవర్తన, ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పిల్లల భావోద్వేగ వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రేమతో, సహనంతో, ప్రోత్సాహంతో పెరిగిన పిల్లలు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో, సానుకూల ఆలోచనలతో ఎదుగుతారు. కానీ ఇంట్లో తరచూ గొడవలు, తిట్లు, కొట్లాటలు, మద్యం సమస్యలు, నిర్లక్ష్యం, పిల్లలను ఇతరులతో పోల్చడం వంటి పరిస్థితులు ఉంటే పిల్లల్లో భయం, కోపం, ఒంటరితనం, అసహనం పెరుగుతాయి.
"పెద్దల ప్రవర్తన పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుందా?"
చిన్నతనంలో ఎదురయ్యే అనుభవాలు పిల్లల సంజ్ఞానాత్మక (Cognitive), భావోద్వేగ (Emotional), మానసిక (Psychological) వికాసంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. సైకాలజీ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా, పిల్లలు చూసే వాతావరణాన్ని అనుకరిస్తూ నేర్చుకుంటారు. అందుకే "పెద్దల ప్రవర్తన పిల్లల భవిష్యత్తును నిర్ణయించే ప్రధాన అంశం"గా మారుతుంది.
ప్రస్తుతం పిల్లలలో అనేక రకాల మానసిక సమస్యలు కనిపిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడి, చదువులో పోటీ, మార్కుల భయం వల్ల ఆందోళన సమస్యలు (Anxiety) పెరుగుతున్నాయి. కొంతమంది పిల్లలు ఎప్పుడూ భయపడుతూ, కొత్త వ్యక్తులతో మాట్లాడలేక, చిన్న విషయానికే కంగారు పడుతూ ఉంటారు. మరికొందరిలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆటలపై ఆసక్తి తగ్గడం, ఒంటరిగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం, ఎప్పుడూ బాధగా కనిపించడం వంటి లక్షణాలు దీనిలో భాగం.
ఇంకా ADHD, ఆటిజం స్పెక్ట్రమ్ సమస్యలు, ప్రవర్తనా సమస్యలు, కోప నియంత్రణ లోపం, స్క్రీన్ అడిక్షన్, మొబైల్ గేమింగ్ వ్యసనం, లెర్నింగ్ డిఫికల్టీస్ వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల పిల్లల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సామాజిక సంబంధాలు దెబ్బతింటున్నాయి.
పాఠశాల వాతావరణం కూడా పిల్లల మనస్తత్వంపై గొప్పగా ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయుల ప్రవర్తన, స్నేహితుల మధ్య సంబంధాలు, బుల్లీయింగ్ (వేధింపులు) అవమానాలు, ఇతరులతో పోల్చడం వంటి అంశాలు పిల్లలలో మానసిక ఒత్తిడిని పెంచుతాయి.
కొంతమంది పిల్లలు తమ బాధలను బయటకు చెప్పుకోలేక అంతర్గతంగా మానసికంగా కుంగిపోతుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ప్రేమ, మద్దతు, అవగాహన అత్యంత అవసరం. పిల్లలను ఎప్పుడూ మందలించడం, తిట్టడం, కొట్టడం సమస్యలకు పరిష్కారం కాదు. వారి భావాలను వినడం, అర్థం చేసుకోవడం, ప్రోత్సహించడం అవసరం. పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం గడపడం, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడడం, వారి భావోద్వేగాలను గౌరవించడం చాలా ముఖ్యం.
"సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం"
పిల్లలలో వచ్చే మానసిక, భావోద్వేగ సమస్యలను గుర్తించి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడంలో సైకాలజిస్టులు ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల సమస్యలను “వయస్సు ప్రభావం”గా తీసుకుంటారు. కానీ కొన్ని సమస్యలు భవిష్యత్తులో తీవ్రమైన మానసిక సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం, తమ పిల్లల్లో వున్న సమస్యలను గుర్తించడంలో అలసత్వం, గుర్తించినా వారు అంగీకరించక పోవడం, వారి బంగారు భవిష్యత్తును అడ్డంకి కారాదు. అందువల్ల ప్రారంభ దశలోనే సైకాలజిస్టుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం.
సైకాలజిస్టులు పిల్లల ప్రవర్తన, కుటుంబ పరిస్థితులు, పాఠశాల వాతావరణం, భావోద్వేగ స్థితిని విశ్లేషించి సమస్యల మూలకారణాలను గుర్తిస్తారు. తరువాత పిల్లల వయస్సు, సమస్య తీవ్రత ఆధారంగా కౌన్సెలింగ్ మరియు వివిధ థెరపీలు అందిస్తారు. పిల్లలు నేరుగా తమ భావాలను చెప్పలేకపోవచ్చు కాబట్టి సైకాలజిస్టులు ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తారు.
Play Therapy ద్వారా పిల్లలు ఆటలలో తమ భావాలను వ్యక్తపరచేలా చేస్తారు. Art Therapy ద్వారా చిత్రాలు, రంగుల సహాయంతో పిల్లల అంతర్మనస్సును అర్థం చేసుకుంటారు. Cognitive Behaviour Therapy (CBT) ద్వారా పిల్లలలో ఉన్న నెగెటివ్ ఆలోచనలను మార్చి సానుకూల ఆలోచనలను పెంచే ప్రయత్నం చేస్తారు. Behaviour Therapy ద్వారా ప్రవర్తనా సమస్యలను తగ్గించి మంచి అలవాట్లను అభివృద్ధి చేస్తారు. Family Counselling ద్వారా తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్న భావోద్వేగ దూరాన్ని తగ్గిస్తారు. అలాగే Relaxation Techniques, Mindfulness, Social Skills Training వంటి పద్ధతుల ద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం, భావోద్వేగ నియంత్రణ పెంపొందిస్తారు.
"పిల్లల చిన్న చిన్న ప్రవర్తనల వెనుక పెద్ద భావోద్వేగ సమస్య దాగి ఉండవచ్చు"
పిల్లల మానసిక ఆరోగ్యం కేవలం కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, సమాజం మొత్తం బాధ్యతగా భావించాలి. ప్రతి పాఠశాలలో కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉండాలి. ఉపాధ్యాయులు కూడా పిల్లల భావోద్వేగ సమస్యలను గుర్తించే విధంగా శిక్షణ పొందాలి. పిల్లలపై అధిక ఒత్తిడి కాకుండా, వారి సామర్థ్యాలను ప్రోత్సహించే వాతావరణం అవసరం.
పిల్లల చిన్న చిన్న ప్రవర్తనల వెనుక పెద్ద భావోద్వేగ సమస్యలు దాగి ఉండవచ్చు. అందువల్ల వారిని అర్థం చేసుకోవడం, ప్రేమతో మార్గనిర్దేశం చేయడం అత్యంత ముఖ్యం.
"మానసిక సమస్య ఒక బలహీనత కాదు - అది కూడా చికిత్స అవసరమైన ఆరోగ్య సమస్య"
పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడగలిగితేనే ఆరోగ్యకరమైన కుటుంబాలు, మంచి సమాజం, బలమైన భవిష్యత్తు నిర్మించగలం.
సమయానికి సరైన కౌన్సెలింగ్, థెరపీ, కుటుంబ మద్దతు లభిస్తే పిల్లలు మానసికంగా బలంగా ఎదిగి, సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా మారగలరు. అందుకే పిల్లల మానసిక ఆరోగ్య పరిరక్షణలో సైకాలజిస్టుల పాత్రను ప్రతి కుటుంబం గుర్తించాల్సిన అవసరం ఉంది. మానసిక సమస్య ఒక బలహీనత కాదు - అది కూడా చికిత్స అవసరమైన ఆరోగ్య సమస్య అని భావించి అవసరమైన సమయంలో స్టిగ్మాను విడనాడి సైకాలజిస్టులను ఎటువంటి మొహమాటం లేకుండా సంప్రదించి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
వ్యాసకర్త:
కె.పున్నంచందర్, సైకాలజిస్ట్
M.Sc Psychology, MSW (Medical & Psychiatry), LLB
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >