| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 18 కిలోల ఎండు గంజాయి పట్టివేత

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 18 కిలోల ఎండు గంజాయి పట్టివేత

రూ.9 లక్షల విలువైన గంజాయి స్వాధీనం – మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్‌

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్‌ శాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 18 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని, అక్రమంగా గంజాయి తరలిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

దసరా పండుగ నేపథ్యంలో అక్రమ మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా, తనిఖీలు చేపట్టారు. నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌ రైలులో గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనివాసులు నేతృత్వంలో కానిస్టేబుళ్లు అమృత్‌ రెడ్డి, శిరీష, రాజు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) సిబ్బంది సహకరించారు.

తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అధికారులు తనిఖీ చేయగా, అతని వద్ద 18 కిలోల ఎండు గంజాయి లభించింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని అశోక్‌ (26)గా గుర్తించామని, అతను మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన వ్యక్తి అని అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని టిట్లాగఢ్‌ ప్రాంతం నుంచి నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌ రైలులో గంజాయిని తీసుకొని సోలాపూర్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు.

అక్రమ మాదకద్రవ్యాలపై సమాచారం అందించండి

దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అక్రమంగా నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి రవాణా, ఇతర మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిస్తే వెంటనే ఎక్సైజ్‌ శాఖ అధికారి ముకుంద రెడ్డి, కోరారు.

సమాచారం అందించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 2523 కు కాల్‌ చేయవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అక్రమ కార్యకలాపాలపై చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పండుగ సమయంలో అక్రమ మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అధికారులు హెచ్చరించారు.

Previous సిరిసిల్లలో బీజేపీ vs కాంగ్రెస్... దిష్టిబొమ్మ దహనంపై రచ్చ, రాహుల్, ప్రియాంకపై ఫైర్
Next ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీ ముఠాలో పరారీలో ఉన్న మరో నిందితుడి అరెస్ట్
ADVERTISEMENT