| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

“ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి

“ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి

డైలీ భారత్, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ఆమె సాధారణ మహిళ వేషంలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా అర్ధరాత్రి రోడ్డుపై నిలబడిన ఆమెను దాదాపు 40 మంది ఆకతాయిలు వేధింపులకు గురి చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెట్టారు. అనంతరం వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు.

అయితే సీపీ సుమతి ఇలాంటి ఫీల్డ్ ఆపరేషన్లు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా సీక్రెట్ ఆపరేషన్ల ద్వారా అమ్మాయిల అక్రమ రవాణా, వేధింపులకు పాల్పడుతున్న ముఠాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2004లో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను ఎలా పట్టుకున్నారనే విషయాన్ని ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

“అమ్మాయిల ట్రాఫికింగ్ జరుగుతోందన్న సమాచారంతో అప్పట్లో మేము స్టింగ్ ఆపరేషన్ చేపట్టాం. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో రైడ్లు నిర్వహించాం. చివరకు కూకట్‌పల్లి, చందానగర్ ప్రాంతాల్లో కీలక సమాచారం లభించింది. అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను పట్టుకునేందుకు నేను బ్రోతల్ కీపర్‌లా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అది ఆ ఆపరేషన్‌లో భాగం.

బిజినెస్ నిర్వహించే వ్యక్తుల దగ్గరకు వెళ్లేటప్పుడు నా వద్ద వెపన్ కూడా పెట్టుకున్నాను. అమ్మాయిలను సప్లై చేసే వ్యక్తి ఆటోలో కూకట్‌పల్లి నుంచి బయల్దేరాం. ఆ సమయంలో నన్ను ఫాలో అవుతున్న ఇద్దరు ఎస్సైల వాహనం మిస్ అయింది. చివరకు ఒక బ్రోకర్ నన్ను అమ్మాయిల ట్రాఫికింగ్ జరుగుతున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు.

అక్కడ ముగ్గురు మహిళలు, మరికొందరు సప్లయర్లు ఉన్నారు. నన్ను చూసి వారికి అనుమానం వచ్చింది. ‘ఇంత చిన్న వయసులో నిజంగానే బ్రోకరా?’ అని సందేహపడ్డారు. 

కానీ నేను చాలా తెలివిగా వారిని నమ్మించాను. నా దగ్గర 10 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పాను. దాంతో వాళ్లలో ఒకరు ‘మీ లొకేషన్ దగ్గరకు తీసుకెళ్లండి’ అంటూ ఒత్తిడి చేశారు.

"ఇప్పుడు కాదు.. 15 రోజుల తర్వాత కాంటాక్ట్ అవుతాను" అని చెప్పినా వినలేదు. అనుమానం రాకుండా వారితో కలిసి ఆటోలో ఎక్కి బయల్దేరాను. మళ్లీ కూకట్‌పల్లి వరకు వచ్చాం. అప్పటికీ పోలీసులతో నాకు కాంటాక్ట్ లేదు. చివరకు ‘రెండు నిమిషాల్లో ఫోన్ చేసి వస్తాను’ అంటూ సినిమాల్లో చూపించినట్లుగా బయటకు వచ్చి మా టీమ్‌ను అక్కడికి పిలిపించాను.

దాంతో అమ్మాయిలను సప్లై చేస్తున్న ఆర్గనైజర్లు, ముఠా సభ్యులు అందరూ పోలీసులకు చిక్కారు. అయితే ఆ రెండు గంటలు నేను తీవ్ర టెన్షన్ అనుభవించాను. ఏ మాత్రం తేడా వచ్చినా నేను సురక్షితంగా బయటపడేదాన్ని కాదు. డిపార్ట్‌మెంట్ కూడా ఇబ్బందుల్లో పడేది. కానీ నా దగ్గర వెపన్ ఉండటమే నాకు ధైర్యం ఇచ్చింది.

అమ్మాయిలు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కాలేజీలో చదివే రోజుల్లో నేనూ చాలా సార్లు వేధింపులకు గురయ్యాను. కానీ ధైర్యంగా ఎదురు నిలబడాలి. తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్లో ధైర్యాన్ని నూరిపోసాలి” అని సీపీ సుమతి పేర్కొన్నారు.

Previous చిన్న కొర్రాజుల జాతర మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Next పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
ADVERTISEMENT