Posted on 2026-05-07 19:55:06
వ్యాస కర్త: కె. పున్నంచందర్,సైకాలజిస్ట్
M.Sc. Psychology, MSW (Medical & Psychiatry), LLB, TPA STATE VICE PRESIDENT
(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
డైలీ భారత్, స్పెషల్: ఈ రోజుల్లో మనిషి జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న అంశాలలో మానసిక ఒత్తిడి (Stress) ప్రధానమైనది. వేగవంతమైన జీవనశైలి, పెరుగుతున్న పోటీ, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ భద్రతపై భయం, సామాజిక ఒత్తిడులు ఇవన్నీ కలిసి మనిషి మనసును నెమ్మదిగా కృంగదీస్తున్నాయి. ఒకప్పుడు మనిషి శారీరక శ్రమతో అలసిపోయేవాడు… ఇప్పుడు మానసిక అలసటతో కూలిపోతున్నాడు.
కెరటం పడి లేస్తుంది…
ఒత్తిడి పడగొడుతుంది…
ఓటమిని రాసిపెడుతుంది…
మనిషిని లోపల నుంచి బలహీనుడిని చేస్తుంది…
దాని మర్మం ఏమిటో కానీ, మనిషిని "మర" మనిషిగా మార్చి మాయ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో జీవితాన్నే బలి తీసుకునేంత తీవ్రతను సంతరించుకుంటుంది.
బయటకు నవ్వుతూ కనిపించే వ్యక్తి లోపల ఎంతగా మానసికంగా విరిగిపోతున్నాడో చాలాసార్లు సమాజానికి తెలియదు. “నేను బాగానే ఉన్నాను” అనే మాట వెనుక ఎన్నో బాధలు దాగి ఉంటాయి.
అయితే ఒత్తిడి అన్నది పూర్తిగా చెడు కాదు. ఒక స్థాయి వరకు ఉండే ఒత్తిడి మనిషిని లక్ష్యసాధన వైపు నడిపిస్తుంది. అది కృషిని పెంచుతుంది, బాధ్యతను గుర్తు చేస్తుంది, సమయపాలనను నేర్పిస్తుంది. దాన్నే “యూస్ట్రెస్” (Eustress) అంటారు. కానీ అదే ఒత్తిడి అధికమైతే అది మనిషి పతనానికి కారణమవుతుంది. దాన్నే “డిస్ట్రెస్” (Distress) అంటారు.
ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే అది కేవలం మనసునే కాదు… శరీరాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యం ఏర్పడి, కార్టిసాల్ వంటి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. దాంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఇటీవలి కాలంలో పెరుగుతున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ మన జీవన విధానం మరియు ఒత్తిడికి నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి. మనం సంపాదన కోసం పరుగు తీస్తున్నాం… కానీ ఆరోగ్యాన్ని మాత్రం వెనక్కి నెట్టేస్తున్నాం.
“ఎంత ఇచ్చి కొన్నా ఆరోగ్యం తిరిగి రాదు” అనే వాస్తవాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలి. సంపాదన కోసం ఆరోగ్యాన్ని కోల్పోతే, తర్వాత ఆ సంపాదనతో ఆరోగ్యాన్ని తిరిగి కొనలేమనేది చేదు నిజం.
“ఒత్తిడి మనిషిని లోపల నుంచి మార్చేస్తుంది”
ఒత్తిడి వ్యక్తిగత జీవితం మీద మాత్రమే కాకుండా కుటుంబ, సామాజిక జీవనాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. వ్యక్తిగతంగా చిరాకు, కోపం, అసహనం, ఆత్మవిశ్వాసం లోపం, నిద్రలేమి, నిరుత్సాహం వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో చిన్న విషయానికే ఆందోళన పెరుగుతుంది. మరికొందరిలో ఒంటరితనం పెరిగి, ఎవరికీ మాట్లాడకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది.
కుటుంబంలో చిన్న విషయాలకే గొడవలు, అనుబంధాల దెబ్బతినడం, పిల్లలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోతే పిల్లల్లో భయం, ఆందోళన, చదువుపై దృష్టి లోపం, మొండితనం వంటి సమస్యలు పెరుగుతాయి.
సామాజికంగా వ్యక్తి ఒంటరితనానికి లోనవుతాడు. సంబంధాలు దూరమవుతాయి. పనితీరు తగ్గిపోతుంది. కొందరు మద్యం, ధూమపానం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు బానిసలవుతారు. మరికొందరిలో ఆత్మహత్యా ఆలోచనలు కూడా పెరుగుతాయి.
“మెదడు పనితీరుపై ఒత్తిడి ప్రభావం”
ఒత్తిడి మన మెదడు పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాగ్నిటివ్ ఫంక్షన్స్‌ను డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఆలోచన, జ్ఞాపకశక్తి, నిర్ణయ సామర్థ్యం, పనిపై శ్రద్ధ, దృక్పథం, పర్సెప్షన్ వంటి అంశాలు దెబ్బతింటాయి.
ఏకాగ్రత తగ్గిపోవడం, విషయాలను మర్చిపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, చిన్న విషయానికే గందరగోళానికి గురవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. విద్యార్థుల్లో చదువుపై దృష్టి తగ్గిపోతుంది. ఉద్యోగుల్లో పనితీరు పడిపోతుంది. గృహిణుల్లో భావోద్వేగ అలసట పెరుగుతుంది. వృద్ధుల్లో ఒంటరితనం మరింత తీవ్రంగా మారుతుంది.
“బర్నౌట్ స్టేజ్ - ప్రమాదకర దశ”
ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే “బర్నౌట్” అనే ప్రమాదకర దశకు చేరుకుంటారు. ఈ దశలో వ్యక్తి పూర్తిగా మానసికంగా, శారీరకంగా అలసిపోతాడు. పనిపై ఆసక్తి తగ్గిపోతుంది. జీవితంపై నిరుత్సాహం పెరుగుతుంది. “నేను పనికిరానివాడిని” అనే భావన కలుగుతుంది.
ప్రస్తుతం ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ రంగంలో పనిచేసేవారు, వైద్యులు, ఉపాధ్యాయులు, గృహిణులు చాలా మంది బర్నౌట్ సమస్యతో బాధపడుతున్నారు. నిరంతర ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, నిద్రలేమి, ఎప్పుడూ మొబైల్ మరియు సోషల్ మీడియాతో గడపడం దీనికి ప్రధాన కారణాలు.
“సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం”
ఇలాంటి పరిస్థితుల్లో సైకాలజిస్టుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఒక వ్యక్తి బాధను వినడం కూడా ఒక థెరపీగా పనిచేస్తుంది. చాలామంది తమ భావోద్వేగాలను బయటపెట్టలేక లోపలే మోస్తుంటారు. అలాంటి సమయంలో సైకాలజిస్టు ఒక స్నేహితుడిలా, మార్గదర్శకుడిలా, భావోద్వేగ మద్దతుదారుడిలా పనిచేస్తాడు.
సైకాలజిస్టులు వ్యక్తి సమస్యలను లోతుగా అర్థం చేసుకుని, అతని ఆలోచనా విధానం, భావోద్వేగాలు, ప్రవర్తన మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తారు. వ్యక్తిలో ఉన్న నెగటివ్ థింకింగ్, భయాలు, అపోహలు, నిరాశలను గుర్తించి వాటిని మార్చే విధంగా శాస్త్రీయ పద్ధతుల్లో సహాయం చేస్తారు.
ప్రస్తుతం అనేక మంది “నాకు ఏం కాలేదు”, “నేనే చూసుకుంటా” అంటూ సమస్యలను దాచిపెడుతున్నారు. కానీ ప్రారంభ దశలోనే సైకాలజిస్టును సంప్రదిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. ఆలస్యమైతే డిప్రెషన్, పానిక్ డిసార్డర్స్, వ్యసనాలు, ఆత్మహత్యా ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
ముఖ్యంగా ఆత్మహత్యా ఆలోచనలు ఉన్న వ్యక్తులకు సమయానికి కౌన్సెలింగ్ అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చు. చాలా సందర్భాల్లో ఒక మంచి మాట, ఒక సహానుభూతి గల వినికిడి, ఒక సరైన మార్గదర్శకత్వం వ్యక్తి జీవితాన్ని తిరిగి నిలబెడుతుంది.
“సైకాలజీలో అందుబాటులో ఉన్న థెరపీలు”
మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సైకాలజీలో వివిధ రకాల థెరపీలు అందుబాటులో ఉన్నాయి.
కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (CBT). ఈ థెరపీ ద్వారా నెగటివ్ ఆలోచనలను పాజిటివ్‌గా మార్చడం సాధ్యమవుతుంది. “నేను చేయలేను”, “నా జీవితం ముగిసిపోయింది” వంటి ఆలోచనలను గుర్తించి వాటిని వాస్తవ దృక్పథంతో మార్చడం నేర్పిస్తారు. డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ (DBT). భావోద్వేగ నియంత్రణలో ఈ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. కోపం, ఆవేశం, తీవ్ర భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించడం నేర్పిస్తుంది.
మైండ్‌ఫుల్‌నెస్ థెరపీ ప్రస్తుత క్షణంలో జీవించడం నేర్పిస్తుంది. గతం గురించి పశ్చాత్తాపం, భవిష్యత్తుపై భయం తగ్గించడంలో సహాయపడుతుంది. రిలాక్సేషన్ థెరపీ దీర్ఘ శ్వాస వ్యాయామాలు, ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్, గైడెడ్ ఇమేజరీ వంటి పద్ధతుల ద్వారా శరీరం, మనసుకు విశ్రాంతి లభిస్తుంది. బిహేవియరల్ థెరపీ చెడు అలవాట్లను తగ్గించి మంచి అలవాట్లు పెంపొందించడంలో సహాయపడుతుంది. సపోర్టివ్ కౌన్సెలింగ్ వ్యక్తి తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచుకునే అవకాశం పొందుతాడు. ఇది భావోద్వేగ భారం తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా నిద్ర, ఆహారం, వ్యాయామం, రోజువారీ అలవాట్లను సరిచేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
“ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం”
ఒత్తిడి నియంత్రణలో, మానవ సంబంధాల కొనసాగింపులో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వ్యక్తి తన భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సానుకూల సంబంధాలు కొనసాగించడం నేర్చుకుంటాడు.
ఎవరైనా కోపంగా మాట్లాడితే వెంటనే స్పందించడం కాకుండా, ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో భాగమే. ఇది వ్యక్తి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
“ఒత్తిడిని తగ్గించే మార్గాలు”
ఒత్తిడిని తగ్గించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం
యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి, సరైన నిద్ర,
సమతుల్య ఆహారం తీసుకోవాలి.
కుటుంబ సభ్యులతో సమయం గడపడం, మొబైల్ మరియు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించాలి.
ప్రకృతి మధ్య నడక, సంగీతం వినడం అలవాటు చేసుకోవాలి
అవసరమైనప్పుడు “లేదు” అని చెప్పడం నేర్చుకోవాలి
సమస్యలను ఒంటరిగా మోసుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడాలి.
ముఖ్యంగా “మైండ్‌ఫుల్‌నెస్” పద్ధతి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. గతం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుతం జరుగుతున్న అనుభవాన్ని గమనించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
“సమాజం కూడా మారాలి”
మన సమాజంలో ఇప్పటికీ మానసిక సమస్యలపై అపోహలు ఉన్నాయి. సైకాలజిస్టును కలిస్తే “పిచ్చివాడు” అనే ముద్ర వేయడం చాలా ప్రమాదకరం. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
జ్వరమొస్తే డాక్టర్‌ను కలుస్తాం…
అలాగే మనసు బాధపడితే సైకాలజిస్టును కలవడం కూడా సహజమే.
ప్రతి విద్యాసంస్థలో, ప్రతి ఉద్యోగ సంస్థలో, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి. కుటుంబ సభ్యులు కూడా విమర్శించడం కాకుండా వినడం నేర్చుకోవాలి.
ఒత్తిడి వ్యక్తి జీవితంలో తప్పనిసరి అయినా, దాన్ని నియంత్రించడం మన చేతుల్లోనే ఉంది. ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తిస్తే సైకాలజిస్టును సంప్రదించడం మరవద్దు.
జీవితం అమూల్యం…
ఒత్తిడి తాత్కాలికం.
దాన్ని జయిద్దాం… జీవితాన్ని నిర్మిద్దాం.
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >