| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్...  2.310 కిలోల గంజాయి స్వాధీనం

డైలీ భారత్, భూపాలపల్లి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో పోలీసులు సమర్థవంతంగా చర్యలు తీసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 2.310 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ రోజు (05.05.2026) ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు, సీఐ కర్ణాకర్ రావు ఆదేశానుసారం  ఎస్‌.ఐ.సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి  ఆధ్వర్యంలో పోలీసు బృందం మరియు సిసిఎస్  పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో భాగంగా జెంషెడ్ బేగ్ పేట బ్రిడ్జ్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని బ్లాక్ కలర్ పల్సర్ బైక్‌పై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపడానికి ప్రయత్నించగా, వారు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వివరాలు:

1. బైరగాని గణేష్ (16 సం.), కూలీ, రేగొండ గ్రామం

2. పాయం వర్షిత్ (17 సం.), విద్యార్థి, నర్సాపూర్ గ్రామం, తాడ్వాయి మండలం

3. బీస ప్రవీణ్ (23 సం.), డ్రైవర్, వెంకటేశ్వర్లపల్లి గ్రామం

వారి వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లను తనిఖీ చేయగా మొత్తం 2.310 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీని అంచనా విలువ సుమారు రూ.1,00,000/-. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ మరియు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా సరిహద్దు ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి కొత్తపల్లిగోరి మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలనే ఉద్దేశ్యంతో ఈ అక్రమ వ్యాపారంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితులను న్యాయస్థానానికి హాజరుపరచడం జరుగుతుంది. గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ మాట్లాడుతూ...

“జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయి. ఇలాంటి నేరాలలో పాల్గొనే వారిపై కఠినంగా వ్యవహరిస్తాము. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని” కోరారు.

Previous గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు
Next మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం
ADVERTISEMENT