సైకిల్‌పై 50 కిలోమీటర్లు.. ఆపదలో ఉన్న బాలుడిని కాపాడిన "ఆపరేషన్ కవాచ్" రక్షణ కవచం.
ఆపరేషన్ కవాచ్ అద్భుతం: చీకటి ప్రయాణంలో బాలుడికి అభయమిచ్చిన పోలీసులు!
జిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి:
మందలించిందని మనస్తాపం.. పంతంతో ఇల్లు వదిలి అర్ధరాత్రి ఒంటరి ప్రయాణం.. కానీ ఆ బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చింది కామారెడ్డి పోలీసుల నిశిత దృష్టి. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ఆపరేషన్ కవాచ్" కేవలం నేరస్తుల వేటకే కాదు, ఆపదలో ఉన్నవారికి అభయహస్తం అని కామారెడ్డి పోలీసులు మరోసారి నిరూపించారు.
నిజామాబాద్ నగరం వినాయక నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు, మాతృమూర్తి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎవరికీ చెప్పకుండా మంగళవారం మధ్యాహ్నం తన సైకిల్‌పై నిజామాబాద్ నుండి కామారెడ్డి వైపు బయలుదేరాడు. దాదాపు 50 కిలోమీటర్ల ప్రయాణం చేసి, అర్ధరాత్రి 11:00 గంటల సమయంలో టేక్రియాల్ జంక్షన్ వద్దకు చేరుకున్నాడు.
అదే సమయంలో అక్కడ "ఆపరేషన్ కవాచ్" తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు.. చీకట్లో ఒంటరిగా సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని గమనించారు. అనుమానం వచ్చి ఆపి, బాలుడిని ప్రేమతో పలకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
అప్పటికే కుమారుడి ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు బుధవారం తెల్లవారుజామున 3:00 గంటలకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను కాపాడిన పోలీసులకు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. "ఆపరేషన్ కవాచ" యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేరాల నియంత్రణతో పాటు, ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమేనని పునరుద్ఘాటించారు.
కామారెడ్డి జిల్లాలో ప్రజల భద్రత కోసం మేము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "ఆపరేషన్ కవాచ్" నేడు ఆపదలో ఉన్న ఒక బాలుడిని సురక్షితంగా రక్షించడం ఎంతో సంతోషకరం. అర్ధరాత్రి వేళ ఆ బాలుడు ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు, మా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, మానవీయ కోణంలో స్పందించి ఆ బాలుడి భవిష్యత్తును కాపాడటం అభినందనీయం.
పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎవరైనా ఆపదలో ఉన్నా లేదా అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు కనిపించినా వెంటనే "డయల్ 100" లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రజల రక్షణే మా మొదటి ప్రాధాన్యత. సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుడిని కాపాడిన దేవునిపల్లి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.