Posted on 2026-03-07 18:02:10
కక్షీదారులకు సత్వర న్యాయం సౌలభ్యాలు
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతన కోర్టు బిల్డింగ్ సముదాయానికి నిర్మాణానికి భూమి పూజ
వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
కార్యక్రమానికి హాజరైన హైకోర్టు న్యాయ మూర్తులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ తెలిపారు.
సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో 12 రకాల న్యాయస్థానాలు సెల్లార్తోపాటు టెన్ ప్లస్ టు శైలిలో నిర్మాణానికి సిరిసిల్లలో శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించగా, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన లో పాల్గొనగా, సిరిసిల్లలో హైకోర్టు న్యాయమూర్తి కం జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఇవి వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ నీరజ, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వ మత ప్రార్థనలు చేసి.. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వర్చువల్ విధానంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. నూతన కోర్టు భవన సముదాయం అన్ని కోర్టుల నిర్వహణకు సరిపోయే విధంగా ఉంటుందని వెల్లడించారు.
నూతన కోర్టులో మౌలిక వసతులతోపాటు తగినంత సిబ్బంది ఉండాలని సూచించారు
సిరిసిల్ల జిల్లాకు భౌగోళికంగా, పరిపాలన పరంగా ప్రాముఖ్యత ఉందని, వ్యవసాయం జీవనోపాధితో అభివృద్ధి చెందుతున్న జిల్లా అని పేర్కొన్నారు. ఇక్కడ చేనేత పరిశ్రమ ఎంతో ప్రసిద్ధి పొందింది అని పేర్కొన్నారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టు కు వచ్చే కక్షి దారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయ మూర్తులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. జిల్లా కోర్టులో 13 వేల కేసులు పైగా కేసులు పెండింగ్ లో నున్నట్లు తెలిపారు. పెండింగ్ కేస్ ల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపాలని, సంబంధిత అధికారులు సమన్వయముతో పని చేయాలని ఆదేశించారు.
న్యాయవ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం
ఈ నూతన కోర్టు భవన నిర్మాణం ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే కొత్త అధ్యాయానికి నాందిగా నిలుస్తుందని హైకోర్టు న్యాయమూర్తి కం జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ పేర్కొన్నారు. రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందేలా న్యాయవ్యవస్థ పని చేయాలన్నారు. ప్రతి పౌరుడు న్యాయస్థానాన్ని ఆశతో, నమ్మకంతో ఆశ్రయించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన కోర్టు భవనం నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజలకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందేలా అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను కాపాడే న్యాయవ్యవస్థకు ఉన్న నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. నిష్పక్షపాతం.. నైతిక విలువలు కాపాడడం అత్యంత ముఖ్యమని ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, న్యాయ పరిపాలన, సమానత్వం, నాణ్యమైన న్యాయ సేవలు అందేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బార్ సభ్యులు సత్యాన్ని వెలికితీసే బాధ్యతతో పని చేస్తూ ప్రజలకు న్యాయం అందేలా అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు.
సిరిసిల్ల జిల్లా సంపదకు కేంద్రం, చరిత్రకు నిలయం
రాజన్న సిరిసిల్ల జిల్లా చరిత్ర, సంస్కృతి, పరిశ్రమలతో ప్రసిద్ధి పొందిన ప్రాంతం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ నీరజ పేర్కొన్నారు పెద్ద టెక్స్టైల్ పవర్ లామ్ కేంద్రంగా ఎదిగి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నదని చెప్పారు. సిరిసిల్లను పవర్‌లూమ్ నగరంగా కూడా పిలుస్తారనీ. ఇక్కడ వేలాది మంది నేత కార్మికులు పగలు రాత్రి శ్రమించి దేశవ్యాప్తంగా పేరు పొందిన వస్త్రాలను తయారు చేస్తున్నారని తెలిపారు.
సిరిసిల్లలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దేశంలో ప్రసిద్ధి చెందిన పవిత్రక్షేత్రాలలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారనీ. ఈ ఆలయం ఈ ప్రాంతానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిందనీ తెలిపారు.
సిరిసిల్ల జిల్లా ప్రత్యేకతల్లో నేత కార్మికుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఇక్కడి నేత కార్మికులు తయారు చేసే చీరలు, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు, ఇతర వస్త్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, వేలాది కుటుంబాలు ఈ టెక్స్టైల్ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని చెప్పారు.
అందుకే సిరిసిల్లను చరిత్ర, ఆధ్యాత్మికత, పరిశ్రమలు కలిసిన సంపద నగరంగా పేర్కొంటారని గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధి, సంస్కృతి, కార్మికుల కృషికి ప్రతీకగా నిలిచిన సిరిసిల్ల ఒక ముఖ్యమైన జిల్లాగా ప్రఖ్యాతిగాంచిందని పేర్కొన్నారు.
ల్యాప్ టాప్ లు పంపిణీ.
జిల్లా సంక్షేమశాఖ ఆద్వర్యంలో దివ్యాంగ డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ఎంపవర్ కార్ట్ లు హై కోర్టు న్యాయమూర్తులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
హైకోర్టు న్యాయమూర్తులకు సన్మానం
అనంతరం హై కోర్టు న్యాయమూర్తులను జిల్లా కోర్టులు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, I వ అదనపు జిల్లా జడ్జి బి.పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల - కమ్ - FAC: కార్యదర్శి, DLSA పి.లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జి, వేములవాడ అజయ్ కుమార్ జాదవ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి, సిరిసిల్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు కావేటి సృజన, మిస్.గడ్డం మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ.గుడిసె సదానందం, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేష్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, గవర్నమెంట్ ప్లీడర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >