తెలంగాణలో సరికొత్త అత్యవసర వ్యవస్థ... ఇక 100 కాదు, 112 కు డయల్ చేయండి
AI, డ్రోన్‌లతో "నెక్స్ట్-జెన్ డయల్ 112" ప్రారంభం... రెస్పాన్స్ టైమ్ తగ్గనుంది
పాత 100 కు బదులు 112... తెలంగాణ పోలీస్ శాఖ కీలక మార్పు
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రజల భద్రత కోసం రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాత "డయల్ 100" స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన "నెక్స్ట్-జనరేషన్ డయల్ 112" (TG-ERSS వర్షన్ 3.0) వ్యవస్థను బుధవారం అందుబాటులోకి తెచ్చింది.
బంజారాహిల్స్‌లోని రాష్ట్ర పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) వేదికగా రాష్ట్ర DGP సి.వి. ఆనంద్ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వ "వన్ నేషన్ - వన్ ఎమర్జెన్సీ నంబర్" విధానంలో భాగంగా ఇకపై రాష్ట్రంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ప్రజలు 112 నంబర్‌కే కాల్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్-జెన్ 112 ప్రత్యేకతలు
ఒకే నంబర్‌పై అన్ని సేవలు:
పోలీస్ (100), ఫైర్ (101), అంబులెన్స్ (108), మహిళలు, వృద్ధులు, శిశు సంరక్షణ (181) సహా మొత్తం 18 రకాల అత్యవసర సేవలు 112 ద్వారా అందుబాటులో ఉంటాయి.
AI మరియు డ్రోన్ టెక్నాలజీ:
ప్రమాద తీవ్రతను AI అంచనా వేస్తుంది. అవసరమైతే వెంటనే డ్రోన్‌ల ద్వారా స్పాట్ నిఘా పెట్టే సదుపాయం ఉంది.
ఆటోమేటిక్ లొకేషన్ ట్రాకింగ్ LBS:
బాధితులు కాల్ చేసిన వెంటనే వారి ఖచ్చితమైన లొకేషన్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. అడ్రస్ చెప్పలేని పరిస్థితిలోనూ సహాయం అందుతుంది.
వేగవంతమైన రెస్పాన్స్:
అత్యాధునిక మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఘటనా స్థలానికి అతి దగ్గరలో ఉన్న పెట్రో కార్లు, బ్లూ కోల్ట్స్‌కు GPS ద్వారా తక్షణ అలర్ట్ వెళ్తుంది.
మల్టీ-మోడ్ కనెక్టివిటీ:
వాయిస్ కాల్ తో పాటు SMS, ఈమెయిల్, పానిక్ బటన్ మరియు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా 24/7 సేవలు పొందవచ్చు.
అధికారుల ప్రకారం ఈ కొత్త వ్యవస్థతో పోలీస్, ఫైర్, వైద్య, విపత్తు నిర్వహణ శాఖల మధ్య సమన్వయం మెరుగవుతుంది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని భారీగా తగ్గించవచ్చు.
గమనిక: పాత 100 నంబర్‌కు కాల్ చేసినా అది ఆటోమేటిక్‌గా 112కి రీడైరెక్ట్ అవుతుంది.