డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మన రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది లాంటిదని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రాజ్యాంగం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదని. లౌకికత, సమానత్వ భావనలను సూచించే ప్రాథమిక పత్రంలా పని చేస్తుందని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం కాకుండా, స్వాతంత్ర్య కోసం పోరాడిన వీరుల కలలు, త్యాగాలు, సంకల్పాలను ప్రతిబింబించే మహత్తర గ్రంథమని అన్నారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా అన్ని రాజ్యాంగ నిపుణులను స్మరించడం, వారికి గౌరవం తెలపడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.
అనేక భాషలు, సంస్కృతులు, మతాలున్న భారతదేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపించే శక్తిగా రాజ్యాంగాన్ని గుర్తించాలన్నారు.నేటి యువతకు రాజ్యాంగాన్ని చదవటం, అర్థం చేసుకోవటం అత్యంత కీలకమని, ప్రజాస్వామ్యంలో పౌర బాధ్యత ఓటు వేయడం మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను గౌరవించి వాటిని ఆచరణలో పెట్టుకోవడమే నిజమైన బాధ్యతనని ఆయన గుర్తుచేశారు.
రాజ్యాంగ దినోత్సవం మన ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం రాజ్యాంగ విలువల పరిరక్షణకు అంకితభావాన్ని పునరుద్ఘాటించుకునే సమయం అని ఆయన చెప్పారు. దేశ అభివృద్ధి పథంలో రాజ్యాంగమే శాశ్వత మార్గదర్శి అని ఆయన అన్నారు.