Posted on 2026-06-22 16:16:28
డైలీ భారత్, మహబూబ్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 12కోట్ల 53 లక్షల రూ ల వ్యయంతో చేపట్టనున్న క్రీడా మౌలిక సదుపాయాల పనులకు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
వాకిటి శ్రీహరి యువతకు మత్తు వదలండి… మైదానాలు చేరండి అని పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం గ్రౌండ్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 12.53 కోట్ల రూపాయలతో(10.70 కోట్ల రూ.లతో అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్, ఒక కోటి రూ.లతో
నాలుగు ఓపెన్ జిమ్స్,51 లక్షల రూ.లతో ఇండోర్ జిమ్, మహిళల అథ్లెటిక్స్ హాస్టల్ మిగిలిన పనులకు 32 లక్షల రూ.లు) వ్యయంతో పలు ఆధునిక క్రీడా సదుపాయాల నిర్మాణానికి ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ క్రీడా కారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్న 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ద్వారా జిల్లాలోని యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ అందే అవకాశం కలుగుతుందని అన్నారు.
“క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జీవన శైలిని మార్చే శక్తివంతమైన సాధనం అని ఆయన అన్నారు. ప్రతి యువకుడు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలి” అని అన్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ నియోజకవర్గం లలో ఇప్పటికే సుమారు 80 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. క్రీడా రంగ అభివృద్ధి కోసం అవసరమైతే వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గారు స్పష్టం చేశారు.
యువత టైమ్‌పాస్‌గా కాకుండా క్రీడలను సీరియస్‌గా తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో స్విమ్మింగ్ ఫూల్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. స్పోర్ట్స్ అసోసియేషన్లు మరింత చురుకుగా పనిచేసి గ్రామ స్థాయి నుండి యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని సూచించారు. క్రీడా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా త్వరితగతిన అనుమతులు ఇచ్చి పనులను వేగవంతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. లక్షలాది యువతకు క్రీడల ద్వారా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్,మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం చేసి మహబూబ్ నగర్ కు మంజూరు చేసిన ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాడు అడిగిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్, కబడ్డీ అకాడమీతో పాటు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను క్రీడల రంగంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే కాకుండా ఒలింపిక్ క్రీడలలో దేశం తరుపున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించేలా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
అవసరమైతే భూముల సేకరణ చేపట్టి క్రీడలకు సంబంధించిన అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపారు. యువతకు క్రీడల ద్వారా మరిన్ని అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తును బలోపేతం చేయాలని సంకల్పించామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాబోయే రోజుల్లో దేశంలోనే క్రీడా రంగంలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్ర డిల్లీ అధికార ప్రతినిధి,రాష్ట్ర
క్రీడా సలహాదారులు ఎపి జితేంధర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడారంగానికి ప్రాధాన్యం పెరిగిందన్నారు. గతంలో క్రీడలకు రూ.50 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించగా,ముఖ్యమంత్రి మొదటి సారి 350 కోట్ల రూ.లు కేటాయించి,తరువాత 640 కోట్లకు పెంచినట్లు తెలిపారు.
మహబూబ్‌నగర్ క్రీడల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, ఇప్పటికే వాలీబాల్ అకాడమీ, కబడ్డీ అకాడమీ మంజూరయ్యాయని చెప్పారు.
జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు.,అందుకు అవసరమైన 30 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు ఆయన తెలిపారు. సరైన సదుపాయాలు కల్పిస్తే మహబూబ్‌నగర్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2914 నుంచి 2024 వరకు పదేళ్ల కాలంలో క్రీడా రంగానికి కేటాయింపు 300 కోట్లు దాటలేదని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌లోనే రూ.360 కోట్లు, రెండో బడ్జెట్‌లో రూ.468 కోట్లు, మూడో బడ్జెట్‌లో రూ.640 కోట్లు క్రీడా శాఖకు కేటాయించిందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్లక్ష్యానికి గురైన స్టేడియాలు, క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్ పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని, మహబూబ్‌నగర్ జిల్లాకు సుమారు రూ.12 కోట్ల 53 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఒక్కో జిల్లాకు రూ.15 నుంచి రూ.18 కోట్ల వరకు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయిస్తున్నామని వెల్లడించారు.
2009 తర్వాత కోచ్‌ల నియామకాలు జరగకపోయినా, ప్రస్తుతం సుమారు 350 మంది కోచ్‌ల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. తెలంగాణను దేశంలోనే క్రీడల హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఆధునిక ట్రాక్‌లు, మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్, శిక్షణ కేంద్రాలు, నిపుణులైన కోచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు.
సీఎం కప్ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తిస్తున్నామని, మొదటి ఎడిషన్‌లో 3.5 లక్షల మంది, రెండో ఎడిషన్‌లో 5.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని,మూడవ ఎడిషన్ లో 10 లక్షల మంది పాల్గొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక అకాడమీల్లో శిక్షణ, ప్రయాణం, వసతి తదితర ఖర్చులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ భరిస్తుందని చెప్పారు.
ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులకు కూడా అవసరమైన ఆర్థిక సహాయం అందించి, జాతీయ, ఆసియా, ఒలింపిక్ స్థాయిల్లో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 17 నుండి 26 వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ సప్తాహ్ సందర్భంగా మాదక ద్రవ్యాల కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.మాదక ద్రవ్యాల నిర్మూలన పై పోస్టర్ ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్.పి శ్రీమతి డి.జానకి, మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్,స్థానిక కార్పొరేటర్ ఉమర్ కొత్వాల్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు , డివైఎస్ఓ రాజశేఖర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >