Posted on 2026-05-09 18:56:47
మద్యం మత్తులో డ్రైవింగ్‌కు చెక్: ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లాలో 3,510 కేసుల్లో ₹42.01 లక్షల జరిమానా – 508 మందికి జైలు శిక్షలు
• రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యమే...
• మత్తులో మృత్యుపాశం: మీ ఒక్క క్షణిక నిర్ణయం.. మీ కుటుంబాన్ని అనాథను చేయకూడదు!
జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ వెల్లడి
డైలీ భారత్, కామారెడ్డి: మద్యం మత్తులో స్టీరింగ్ పట్టినప్పుడు మీరు తిప్పేది కేవలం వాహనాన్ని మాత్రమే కాదు.. మీ కుటుంబ తలరాతను! “ఏం కాదులే, నేను డ్రైవ్ చేయగలను” అని మీరు తీసుకునే ఆ ఒక్క క్షణిక అనాలోచిత నిర్ణయం, రేపు మీ ఇంటి గుమ్మం దగ్గర దీపం వెలిగించి వేయి కళ్లతో ఎదురుచూసే భార్యాపిల్లల నవ్వులను శాశ్వతంగా చిదిమేయవచ్చు. చీకటి పడుతుండగా “నాన్న.. ఎప్పుడు వస్తావు?” అని అడిగే ఆ పసిపాప పిలుపు కన్నతల్లి కన్నీటి శోకంగా మారకూడదంటే, మీ చేతులు మారణాయుధాలుగా మారకముందే మేల్కొనండి. రోడ్డు
మీద మీ నిర్లక్ష్యం మరో అమాయక కుటుంబాన్ని అనాథగా మార్చవచ్చు లేదా మిమ్మల్ని మీ వారికి కాకుండా చేయవచ్చు. మీరు సేవించే ఆ మత్తు సీసా కంటే, మీ మీద ఆధారపడిన మీ కుటుంబం చాలా గొప్పదని గుర్తుంచుకోండి. మీ ఒక్క క్షణికానందం.. జీవితాంతం తీరని విషాదంగా మిగిలిపోకూడదు.
కామారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుండి మే 8 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 3,510 మందికి కోర్టులు శిక్షలు విధించాయి. వీరిపై మొత్తం ₹42,01,000 భారీ జరిమానా విధించగా, సమాజ భద్రతను దృష్టిలో ఉంచుకుని 508 మందికి జైలు శిక్షలు ఖరారయ్యాయి. ఈ చర్యలు మద్యం సేవించి వాహనం నడపడం పట్ల పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
శిక్షల తీవ్రతను పరిశీలిస్తే, 499 మందికి ఒక రోజు నుండి ఐదు రోజుల వరకు జైలు శిక్షలు పడగా, నేర తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది మందికి వారం నుండి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించారు. అదేవిధంగా ఇద్దరు నిందితులకు ఏకంగా 31 రోజుల పాటు జైలు శిక్ష ఖరారైంది. ఈ గణాంకాలే సాక్ష్యంగా, మద్యం తాగి రోడ్డు మీదకు వస్తే కేవలం జరిమానాతో తప్పించుకోవడం సాధ్యం కాదని, అవసరమైతే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం మత్తులో వాహనం నడపడం అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, అది ప్రాణాలతో చెలగాటమాడటంతో సమానమని హెచ్చరించారు. “మద్యం మత్తులో వాహనం నడుపుతున్నప్పుడు స్టీరింగ్‌పై ఉన్నది మీ చేయి కాదు… అది యమపాశం” అని పేర్కొంటూ, కేవలం జరిమానా కట్టి తప్పించుకోవచ్చనే భావన పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారిపై చట్టప్రకారం ఒక రోజు నుంచి నెల రోజుల వరకు జైలు శిక్షతో పాటు జరిమానాలు పడే విధంగా చర్యలు తెసుకుంటున్నాం అని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడం పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పి అన్నారు.
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >