| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏపీడబ్ల్యూజేకి హైకోర్టులో చుక్కెదురు

ఏపీడబ్ల్యూజేకి హైకోర్టులో చుక్కెదురు

నీటి, ఆస్తి పన్ను బకాయిలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పార్టీగా చేర్చాలని ఆదేశం

జర్నలిస్టులకు ఇస్తున్న రాయితీలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని సూచన

సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన హైకోర్టు

నీటి పన్ను బకాయిలు రూ.4,25,300 ఉన్నాయని కార్పొరేషన్ వెల్లడి

ఆస్తి పన్ను బకాయిలుగా రూ.2,29,681 చెల్లించాలని నోటీసులు

బకాయిలు చెల్లించామని ఏపీడబ్ల్యూజే నేతల వాదన

బకాయిలుంటే చట్ట ప్రకారం వసూళ్లు చేయాలని హైకోర్టు స్పష్టం

ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన కస్తాల నమ్మయ్య

డైలీ భారత్,విజయవాడ: 

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన నీటి పన్ను, ఆస్తి పన్ను బకాయిల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీడబ్ల్యూజే)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

విజయవాడ ప్రెస్‌క్లబ్‌కు సంబంధించిన నీటి పన్ను బకాయిలు రూ.4,25,300 ఉన్నాయని కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు కస్తాల నమ్మయ్య ఫిర్యాదు చేయడంతో, విజయవాడ ప్రెస్‌క్లబ్‌తో పాటు ఏపీడబ్ల్యూజేకు కూడా నోటీసులు జారీ చేశారు.

అలాగే ఆస్తి పన్ను విషయంలో సంబంధం లేని జి.ఓ.ను చూపిస్తూ 1996 నుంచి పన్ను మినహాయింపులు పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై కూడా కస్తాల నమ్మయ్య గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు.

విజయవాడ ప్రెస్‌క్లబ్ చూపిస్తున్న జి.ఓ. ఆస్తి పన్ను మినహాయింపుకు వర్తించదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ప్రెస్‌క్లబ్‌కు ఆస్తి పన్ను విధిస్తూ, రెండున్నర సంవత్సరాల బకాయిల కింద రూ.2,29,681 చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఆస్తి, నీటి పన్నుల నుంచి ఉపశమనం కోరుతూ ఏపీడబ్ల్యూజే హైకోర్టును ఆశ్రయించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్, ఏపీడబ్ల్యూజే తరఫున అర్బన్ యూనిట్ అధ్యక్షుడు చావా రవి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులు అనగారిన వర్గాలకు చెందిన వారు కాదని, అందువల్ల ప్రత్యేక రాయితీలు లేదా ప్రయోజనాలకు అర్హులు కారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈ కేసులో పార్టీగా చేర్చాలని ఆదేశించిన హైకోర్టు, జర్నలిస్టులకు ఇస్తున్న రాయితీలు, ప్రయోజనాలపై సమగ్ర వివరాలు సమర్పించాలని సూచించింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిల వివరాలను కూడా రెండు వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది.

నీటి పన్ను, ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించామని ఏపీడబ్ల్యూజే నేతలు చెబుతున్న నేపథ్యంలో, ఆ విషయంపై నిజానిజాలు నిర్ధారించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. బకాయిలు పూర్తిగా చెల్లించినట్లయితే వారిపై చర్యలు అవసరం లేదని, లేని పక్షంలో చట్ట ప్రకారం బకాయిల వసూళ్ల చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ కేసులో సీనియర్ జర్నలిస్టు కస్తాల నమ్మయ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది నాగేంద్రరెడ్డి ద్వారా ఈ పిటిషన్ సమర్పించగా, త్వరలో దీనిపై విచారణ జరగనుంది.

Previous తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Next ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి
ADVERTISEMENT