| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుల అరెస్టు

నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుల అరెస్టు

55 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.

ఇద్దరు నిందితుల అరెస్టు.

డైలీ భారత్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో, బెల్లంపల్లి రూరల్ సీఐ సి.హెచ్.హనోక్ ఆదేశాలతో తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో 06-05-2026 తేదీన నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.

కొండపల్లి రాజేశం (తండ్రి: పోశం, నివాసం: పెరికపల్లి), అట్కాపురం సురేష్ (నివాసం: నేన్నెల) అనే ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేని నకిలీ పత్తి విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారని, తమ ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచారని వచ్చిన సమాచారం మేరకు, బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి ఎస్.ప్రేమ్ కుమార్‌ను వెంట తీసుకొని పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

పెరికపల్లి గ్రామంలోని కొండపల్లి రాజేశం ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా,ఒక సంచిలో ప్రభుత్వం అనుమతి లేని 29.5 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి.

అనంతరం నేన్నెల గ్రామంలోని అట్కాపురం సురేష్ ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా,ఇంటి వెనుక భాగంలో 25.5 కిలోల నకిలీ పత్తి విత్తనాలు గుర్తించారు.

ఈ విత్తనాలను ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొటారు శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి, బెల్లంపల్లి,నేన్నెల మరియు పరిసర ప్రాంతాల రైతులకు మోసపూరితంగా అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు విచారణలో తేలింది.

స్వాధీనం చేసుకున్న మొత్తం నకిలీ పత్తి విత్తనాల బరువు 55 కిలోలు కాగా,వాటి విలువ సుమారు రూ.1,32,000/-గా అంచనా వేశారు.

నకిలీ పత్తి విత్తనాల వినియోగం వల్ల భూమి సారమంతా దెబ్బతిని, భవిష్యత్తులో పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.అలాగే,ఈ విత్తనాల వినియోగం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.గ్లైఫోసేట్ కలిగిన నకిలీ విత్తనాల వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.

రైతులు ప్రభుత్వ అనుమతి పొందిన పత్తి విత్తనాలనే వినియోగించాలని, అలాగే లైసెన్స్ కలిగిన ఎరువులు, పురుగుమందుల దుకాణాల నుంచే కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. దళారుల మాయమాటలు నమ్మి నకిలీ విత్తనాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు.

గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాల విక్రయం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ సి.హెచ్. హనోక్, మండల వ్యవసాయ అధికారి ఎస్. ప్రేమ్ కుమార్, తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


#ramagundam 

Previous అరుదైన వ్యాధి బాధితురాలు సాత్వికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
Next చూపు లేకుండా శిశువు జననం.. తల్లికి రూ.కోటి పరిహారం
ADVERTISEMENT