Posted on 2026-05-05 19:19:08
"జీవితం వద్దనుకోవడం కాదు… బ్రతుకు నుంచి తప్పించుకోవాలనే భావాలను అర్థం చేసుకొని జీవించి సాధించాలి".
వ్యాస కర్త: సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల
ఉపాధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్
(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
డైలీ భారత్, స్పెషల్: మన సమాజంలో నేడు ఒక మౌన మహమ్మారి విస్తరిస్తోంది. అదే ఆత్మహత్యలు. బయటకు చూస్తే అన్ని ఉన్నట్టే కనిపించే జీవితాలు, లోపల మాత్రం గాయాలతో నిండిపోతున్నాయి. “అన్ని ఉండి కూడా జీవితం వద్దనుకోవడం ఎందుకు?” అనే ప్రశ్న మనమందరికీ ఎదురవుతోంది. దీనికి సరళమైన సమాధానం లేదు. ఇది కేవలం మానసిక దౌర్భల్యం మాత్రమే కాదు; ఇది ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న భావోద్వేగ సంక్షోభం, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం, మరియు సహాయం లభించకపోవడం వల్ల వచ్చే తీవ్రమైన పరిస్థితి.
ఇప్పటి పరిస్థితుల్లో వయసు, లింగం, కులం, మతం, సామాజిక వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆత్మహత్యల ముప్పుకు గురవుతున్నారు. విద్యార్థులు పరీక్షల ఒత్తిడితో, యువకులు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల, మహిళలు కుటుంబ సమస్యలతో, వృద్ధులు ఒంటరితనంతో.. ప్రతి వర్గంలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. ముఖ్యంగా సమాజంలో వేగంగా మారుతున్న జీవన విధానం, పెరుగుతున్న అంచనాలు, సోషల్ మీడియా ప్రభావం, మరియు పరస్పర సంబంధాల బలహీనత ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి.
ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ, మన సమాజం ఇప్పటికీ ఆత్మహత్యలను ప్రాధాన్యత అంశంగా గుర్తించడంలో వెనుకబడుతోంది. మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన లోపం, సమస్యలను బయటపెట్టడంపై అపహాస్యం భయం, “మనమే ఎదుర్కోవాలి” అనే తప్పుడు ధోరణి వల్ల బాధపడుతున్న వారు మౌనంగా ఉండిపోతున్నారు. ఈ మౌనం చాలా సందర్భాల్లో ప్రాణాల్ని కోల్పోయే స్థితికి తీసుకెళ్తోంది.
ఆత్మహత్యల నివారణకు సమగ్ర దృష్టి అవసరం. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు; ఇది కుటుంబం, సమాజం, ప్రభుత్వం కలిసి పరిష్కరించాల్సిన అంశం. మొదటగా అవగాహన పెరగాలి. ప్రతి పాఠశాల, కాలేజీ, కార్యాలయం, గ్రామం స్థాయిలో మానసిక ఆరోగ్యంపై చర్చలు జరగాలి.
ముందస్తు గుర్తింపు, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే స్పందించే విధానం అభివృద్ధి కావాలి.సులభంగా అందుబాటులో ఉండే కౌన్సెలింగ్ సేవలు. ప్రతి వ్యక్తికి తన భావాలను చెప్పుకునే ఒక సురక్షిత వేదిక ఉండాలి. ఈ నేపథ్యంలో "కమ్యూనిటీ ఆధారిత వ్యూహం" అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. కుటుంబం, సమాజమే ఒక రక్షణ వలయంగా మారాలి.
గ్రామ స్థాయిలో మెంటల్ హెల్త్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆశా వర్కర్లు, ఆంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు వంటి వారు ప్రమాదంలో ఉన్నవారిని గుర్తించగలిగేలా శిక్షణ ఇవ్వాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు కలిసి ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పులను గమనించి వెంటనే స్పందించాలి. “చావాలని ఉంది” వంటి మాటలను చిన్నచూపు చూడకుండా, వెంటనే నిపుణుల వద్దకు తీసుకెళ్లడం అత్యంత అవసరం.
"సోషల్ వర్కర్స్ రోల్"
సోషల్ వర్క్ ఇంటర్వెన్షన్స్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. వ్యక్తిగత స్థాయిలో కేస్ వర్క్ ద్వారా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చూపడం, గ్రూప్ వర్క్ ద్వారా బాధితులకు పరస్పర మద్దతు కల్పించడం, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ద్వారా సమాజాన్ని కలుపుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో క్రైసిస్ ఇంటర్వెన్షన్ ద్వారా తక్షణ సహాయం అందించడం వంటి చర్యలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
"ఆత్మహత్య నిరోధంలో సైకాలజిస్టుల విస్తృత పాత్ర"
ఆత్మహత్యల నివారణలో సైకాలజిస్టుల పాత్ర కేవలం కౌన్సెలింగ్ ఇవ్వడంలో మాత్రమే పరిమితం కాదు. వారు వ్యక్తి – కుటుంబం – సమాజం అనే మూడు స్థాయిల్లో సమగ్రంగా పని చేస్తారు. ఒక ప్రాణాన్ని కాపాడటంలో వారు తీసుకునే ప్రతి అడుగు అత్యంత కీలకమైంది.
సైకాలజిస్టులు వ్యక్తి మానసిక స్థితిని లోతుగా అర్థం చేసుకునే నిపుణులు. ఒక వ్యక్తి బయటకు చెప్పని బాధలను, ఆలోచనలను, భావోద్వేగాలను సున్నితంగా వెలికి తీయడం వారి ప్రత్యేక నైపుణ్యం. చాలాసార్లు ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తులు నేరుగా “నాకు చావాలని ఉంది” అని చెప్పరు. వారు నిరాశ, అసహనం, ఒంటరితనం, విలువలేమి వంటి సంకేతాల ద్వారా తెలియజేస్తారు. ఈ సంకేతాలను గుర్తించి సరైన దిశలో తీసుకెళ్లడం సైకాలజిస్టుల ప్రధాన బాధ్యతగా ఉంటుంది. వారు స్యూసైడ్ రిస్క్ అసెస్‌మెంట్ చేస్తారు. అంటే, ఒక వ్యక్తి ఆత్మహత్యకు ఎంత వరకు ప్రమాదంలో ఉన్నాడో అంచనా వేస్తారు. ఆలోచనలు ఉన్నాయా? ప్లాన్ ఉందా? ప్రయత్నం చేశాడా? వంటి అంశాలను పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకుంటారు. ఇది ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలక దశ.
సైకాలజిస్టులు వివిధ థెరపీ పద్ధతుల ద్వారా వ్యక్తిలో మార్పు తీసుకువస్తారు. ముఖ్యంగా CBT (Cognitive Behavioral Therapy) ద్వారా వ్యక్తి నెగెటివ్ ఆలోచనలను గుర్తించి, వాటిని సానుకూల దిశలో మార్చడం నేర్పిస్తారు.
“నేను పనికిరానివాడిని”, “నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు” వంటి ఆలోచనలను సవాలు చేయించి, వాస్తవ దృష్టితో ఆలోచించేలా మారుస్తారు. అలాగే DBT (Dialectical Behavior Therapy) ద్వారా భావోద్వేగ నియంత్రణ, సహన శక్తి, సమస్యలను తట్టుకునే నైపుణ్యాలను పెంపొందిస్తారు.
సైకాలజిస్టులు కేవలం వ్యక్తితో మాత్రమే కాకుండా కుటుంబంతో కూడా పని చేస్తారు. చాలా సందర్భాల్లో కుటుంబం సమస్యను అర్థం చేసుకోలేకపోవడం, లేదా సరైన మద్దతు ఇవ్వలేకపోవడం వల్ల పరిస్థితి మరింత కష్టమవుతుంది. కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం, ఎలా మాట్లాడాలి, ఎలా మద్దతు ఇవ్వాలి అనే విషయాల్లో మార్గదర్శనం చేయడం ద్వారా ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తారు. క్రైసిస్ ఇంటర్వెన్షన్ లో కీలక పాత్ర పోషిస్తారు. ఒక వ్యక్తి ఆత్మహత్యకు సమీప స్థితిలో ఉన్నప్పుడు, వెంటనే స్పందించి, అతడిని సురక్షిత స్థితికి తీసుకురావడం, ఆ సమయంలో అతని భావోద్వేగాలను స్థిరపరచడం, ఆశను కలిగించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఈ దశలో ప్రతి నిమిషం విలువైనది.
సైకాలజిస్టులు కమ్యూనిటీ స్థాయిలో కూడా పని చేస్తారు. పాఠశాలలు, కాలేజీలు, గ్రామాలు, పరిశ్రమల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మానసిక ఆరోగ్యంపై చైతన్యం కల్పిస్తారు. ప్రమాదంలో ఉన్న వర్గాలను గుర్తించి, వారికి ముందస్తు కౌన్సెలింగ్ అందిస్తారు. ఇది “ప్రివెన్షన్ ఈజ్ బెట్టర్ దాన్ క్యూర్” అనే భావనకు ఉత్తమ ఉదాహరణ.
సైకాలజిస్టులు సోషల్ వర్కర్స్, డాక్టర్లు, టీచర్లు, మీడియా ప్రతినిధులతో కలిసి ఒక టీమ్‌గా పని చేస్తారు. ఈ సమన్వయం వల్ల సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయి. ఒక వ్యక్తిని గుర్తించడం నుంచి చికిత్స, రీహాబిలిటేషన్ వరకు సమగ్ర సహాయం అందుతుంది.
సైకాలజిస్టులు అందించే లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, భావోద్వేగాలను ఎలా నియంత్రించాలి, సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి వంటి నైపుణ్యాలు నేర్పించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను తగ్గిస్తారు.
ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడంలో సైకాలజిస్ట్ ల పాత్ర ముఖ్యమైనది. రీహాబిలిటేషన్, ఫాలో-అప్ కౌన్సెలింగ్ ద్వారా వారు మళ్లీ ఆ స్థితికి వెళ్లకుండా కాపాడుతారు.
"మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్"
తెలంగాణలోని సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఒకప్పుడు తీవ్రమైన సమస్యగా నిలిచాయి. పవర్‌లూమ్ కార్మికులు అధిక పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో 2008 అక్టోబర్ 10న, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా, సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో “మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్” స్థాపన ఒక మైలురాయిగా నిలిచింది. ఇది కేవలం ఒక సెంటర్ కాదు; ఇది ఒక ఉద్యమానికి శ్రీకారం.
ఈ సెంటర్ ద్వారా గ్రూప్ కౌన్సెలింగ్, వ్యక్తిగత కౌన్సెలింగ్, కుటుంబ కౌన్సెలింగ్, వ్యసన నివారణ సేవలు అందించబడినాయి. ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి, వారికి తక్షణ మానసిక సహాయం అందించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడగలిగారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్స్ సిరిసిల్ల పట్టణంలోని అన్ని వార్డులలో పని చేస్తూ, బాధిత కుటుంబాలను గుర్తించి, వారిని సెంటర్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మరియు వారి బృందం గత 16 సంవత్సరాలుగా ఆత్మహత్యల నివారణలో విశేష సేవలు అందిస్తున్నారు. వారు నేతన్నల కుటుంబాలతో ప్రత్యక్షంగా పని చేస్తూ, CBT, DBT వంటి థెరపీల ద్వారా భావోద్వేగ నియంత్రణ, ఆత్మవిశ్వాసం పెంపు, సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో సహాయం చేశారు. సోషల్ వర్కర్స్ సహకారంతో వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సమాజాన్ని ఈ సమస్యపై చైతన్యవంతం చేశారు.
"మీడియా మద్దతు"
సిరిసిల్లలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ ఉద్యమానికి బలమైన మద్దతు ఇచ్చాయి. అవగాహన కథనాలు, ప్రత్యేక కథనాలు ప్రచురించడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచాయి. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడు సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఇది నిరూపించింది.
ఈ సక్సెస్ స్టోరీ మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది.
సరైన ప్రణాళిక, సమన్వయం, మరియు కమ్యూనిటీ భాగస్వామ్యం ఉంటే ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించవచ్చు. అందుకే ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. ఉచిత సేవలు అందుబాటులో ఉండాలి. పాఠశాలలు, కాలేజీల్లో మానసిక ఆరోగ్య కార్యక్రమాలు తప్పనిసరి చేయాలి.
ఆత్మహత్యలను పూర్తిగా నివారించడం ఒక పెద్ద లక్ష్యం కావచ్చు. కానీ వాటిని తగ్గించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ప్రతి వ్యక్తి తన భావాలను చెప్పుకునే అవకాశం పొందాలి. ప్రతి కుటుంబం వ్యక్తి బాధను వినే సంస్కృతి పెంచుకోవాలి. ప్రతి సమాజం మద్దతుగా నిలవాలి. ప్రతి ప్రభుత్వం సేవలను అందించాలి.
జీవితం విలువైనది. సమస్యలు తాత్కాలికం. కోరితే సహాయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మాట్లాడటం ఒక ప్రారంభమైతే, వినడం ఒక సహాయం అవుతుంది. కలిసి నడవడం ఒక పరిష్కారంగా భావించి మనమందరం కలిసి కృషి చేస్తేనే ఆత్మహత్యలకు ముగింపు పలుకగలం. బావి భారత సమాజాన్ని నిర్మించగలం.
పున్నంచందర్ కనుకుంట్ల,
Msc, psychology, MSW Medical & Psychiatry, LLB
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >