డైలీ భారత్, కామారెడ్డి: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కామారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవనంలో శనివారం పలు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఆర్సీని వెంటనే వేసి అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.
రిటైర్డ్ ఉద్యోగస్థులందరికీ మొత్తం బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ను వెంటనే అమలుచేయాలని, టెట్‌ను రద్దు చేయాలన్నారు. ఈ నెల 17 న అన్ని మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి తహశీల్దార్లకు వినతి పత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే నెల 5 న మున్సిపాలిటీల ముందు వేలాదిగా తరలి వచ్చి ధర్నాలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యల తీవ్రతను తెలియజేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దేవేందర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ కుషాల్, నాయకులు ప్రవీణ్, కలీమొద్దీన్, దేవులా, సుల్తానా, యాదయ్య, రాజు, ఎల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి, అంబీర్ మనోహర్ రావు, బషీర్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.