| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

డైలీ భారత్, వరంగల్: మత్తు పదార్థాల వ్యసనానికి లోనై తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను మళ్లీ సక్రమ మార్గంలోకి తీసుకువచ్చి వారికి బంగారు భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 40 పడకల డి-అడిక్షన్ సెంటర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్శనలో వరంగల్ మరియు హనుమకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, చాహత్ బాజ్‌పాయి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డి-అడిక్షన్ సెంటర్‌లో అందిస్తున్న చికిత్స విధానాలు, పునరావాస కార్యక్రమాలు, బాధితులకు అందిస్తున్న మానసిక మరియు వైద్య సహాయంపై పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్లు ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులను కోర్టు ఆదేశాల మేరకు ఈ సెంటర్‌కు తరలించి, వారికి సమగ్ర చికిత్స అందిస్తూ మత్తు మహమ్మారి నుండి దూరం చేసి సాధారణ జీవితంలోకి తీసుకువచ్చే చర్యలను అభినందించారు.

అలాగే బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారు ఎదుర్కొన్న సమస్యలు, చికిత్స తర్వాత వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మత్తు పదార్థాల వ్యసనం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిచంద్ర రెడ్డి, కేఎంసి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి సెంటర్ కార్యకలాపాలు, చికిత్స విధానాలు, సిబ్బంది సేవలను వివరించారు.

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల నియంత్రణలో పోలీస్ శాఖతో పాటు వైద్య శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే సమాజాన్ని మత్తు వ్యసనాల నుండి రక్షించగలమని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వరంగల్ ఏఎస్పీ శుభం, ఇతర పోలీస్ అధికారులు, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Previous జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Next ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం
ADVERTISEMENT