అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
స్వీయారక్షణార్ధం గ్రామాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
సరైన పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలు గుర్తింపు.
వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం వేములవాడ డీఎస్పీ ఆధ్వర్యంలో కొనరవుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామం మరియు కమ్మరి పేట తండాలల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 39 ద్విచక్ర వాహనాలను గుర్తించి,సంబంధిత యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు అనుమానిత వ్యక్తులను (సస్పెక్ట్స్) తనిఖీ చేసి, వారి ప్రస్తుత కదలికలు, స్థితిగతులపై ఆరా తీశారు. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం (Sense of Security) కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కాలనిలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సర్కిల్ సి.ఐ రవీందర్, ఎస్.ఐ ప్రశాంత్ రెడ్డి, రమేష్, మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.