కాంప్లెక్స్‌లోని అన్ని దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించాలి
30 ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమ సబ్ లీజులు,బినామీ పేర్లతో చోటు చేసుకున్న ఆక్రమణలు ఖాళీ చేయించాలి
AIMIM ఉమ్మడి నల్గొండ జిల్లా జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ గౌస్ ఖాన్
డైలీ భారత్, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్న ఉస్మానియా మస్జీద్ వక్ఫ్ కాంప్లెక్స్‌లో 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యాపారాలపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
కాంప్లెక్స్ పరిధిలో సుమారు 30 సంవత్సరాలుగా కొందరు వ్యక్తులు అద్దె ఒప్పందాల ఆధారంగా లేదా అనధికారికంగా కొనసాగుతున్నట్టు AIMIM ఉమ్మడి నల్గొండ జిల్లా జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ గౌస్ ఖాన్ బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆరోపించారు.
ఉస్మానియా మస్జీద్ కాంప్లెక్స్‌లో 30 ఏళ్లుగా కొనసాగుతున్న సబ్ లీజులు, బినామీ పేర్లతో చోటు చేసుకున్న ఆక్రమణలు ఖాళీ చేయించాలంటూ గౌస్ ఖాన్ జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులను కోరారు
మస్జీద్ ఆస్తులు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండే వక్ఫ్ ఆస్తి కావడంతో నియమ నిబంధనల ప్రకారం కాంప్లెక్స్ వినియోగం జరగాల్సి ఉంటుంది అయితే అనుమతులు లేకుండా షాపులు, గదులు ఆక్రమించి తిష్ట వేసిన వారిపై ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారిందని గౌస్ ఖాన్ అన్నారు
మస్జీద్ కాంప్లెక్స్‌లో కిరాయి దారులుగా కొనసాగుతున్న వ్యక్తులు కాంప్లెక్స్‌లో తిష్టవేసి వక్ఫ్ ఆస్తులను తమ సొంత ఆస్తులుగా అనుభవిస్తున్నారని మండిపడ్డారు
చట్టపరమైన చర్యలు తీసుకొని 30 ఏళ్లుగా అక్రమంగా తిష్ట వేసిన వారిని,సబ్ లీజులను,బినామీ పేర్లతో చోటు చేసుకున్న ఆక్రమణలను ఖాళీ చేయించి కాంప్లెక్స్‌లోని అన్ని షాపులను బహిరంగ వేలం ద్వారా నిరుపేద ముస్లింల కోసం ఉస్మానియా మస్జీద్ కాంప్లెక్స్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని గౌస్ ఖాన్ డిమాండ్ చేశారు.