డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని న్యూ బస్ స్టాండ్ పరిసరాల్లో ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లను ఆహార భద్రతాధికారి జి. విక్రమ్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, వంటశాలల పరిశుభ్రత, వినియోగిస్తున్న పరికరాలను పరిశీలించారు.
తనిఖీల్లో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆహార భద్రతాధికారి తెలిపారు. అదేవిధంగా ఆహార పదార్థాల తయారీలో స్టెయిన్‌లెస్ స్టీల్ కత్తులకు బదులుగా ఇనుప కత్తులను వినియోగిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
ఆహార పదార్థాల తయారీ, విక్రయాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆహార భద్రతాధికారి జి. విక్రమ్ హోటల్, రెస్టారెంట్ యజమానులకు సూచించారు. నిబంధనలు పాటించని సంబంధిత యజమానులకు మెరుగుదల నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
నోటీసుల్లో పేర్కొన్న సూచనలను నిర్దేశిత సమయంలోగా అమలు చేసి వంటశాలల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలను సరిదిద్దకపోతే, ఆహార భద్రతా నిబంధనల ప్రకారం సంబంధిత వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా హోటళ్లు, రెస్టారెంట్లలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఆహార భద్రతాధికారి జి. విక్రమ్ తెలిపారు.