Posted on 2026-07-20 14:55:09
ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి హితవు
ఎల్ నినో ప్రభావం నేపధ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణపై సుదీర్ఘ సమీక్ష
పాల్గొన్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు
డైలీ భారత్, హైదరాబాద్: సూపర్ ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత ప్రతీకూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. ఈ మేరకు గ్రామగ్రామాన క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సోమవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్ష సమావేశం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
సమావేశానికి ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి, తోట లక్ష్మీకాంత్ రావు, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారి, నగర మేయర్ కే.ఉమారాణి, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్, పొలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎస్పీ రాజేష్ చంద్ర, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన, ఆర్.డబ్ల్యూ.ఎస్, భూగర్భ జలాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, కౌలాస్ నాల, పోచారం, సింగీతం, కల్యాణి, రామడుగు, అలీసాగర్, మంచిప్ప, మాసాని తదితర ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, భూగర్భ జలాల స్థితి, తాగునీటి సరఫరా తీరుతెన్నులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటలకు అందిస్తున్న ప్రోత్సాహం, విద్యుత్ డిమాండ్ - సరఫరా తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా చర్చించారు. తక్కువ నీటితో ఏయే పంటలను సాగు చేయవచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేయవచ్చు అనే విషయాలను వ్యవసాయ శాత్రవేత్తలతో పాటు, ఆదర్శ రైతులు తమ అనుభవపూర్వక అంశాలను వివరించారు. ఎల్ నినో నేపధ్యంలో చేపట్టనున్న ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక గురించి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్ లు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. రైతు బాగుంటేనే సమాజంలోని అన్ని వర్గాల వారు బాగుంటారని, అందుకే ప్రస్తుత పరిస్థితులను రైతులు సమర్ధవంతంగా ఎదుర్కొనేలా వారికి అధికార యంత్రాంగం యావత్తు తోడ్పాటును అందిస్తూ అండగా నిలిచేలా ప్రభుత్వం అన్ని ఉమ్మడి జిల్లాలలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై ఉన్నత స్థాయిలో సమీక్షలు ఏర్పాటు చేయించిందని తెలిపారు.
ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ఎల్ నినో ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిరక్షిస్తూ, తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, రైతులను ఆరుతడి పంటల సాగు వైపు ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్కువ నీటితో సాగయ్యే ఆయిల్‌పామ్, కందులు, నువ్వులు, వేరుశనగ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును చేపట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. తీగజాతి, పందిరి కూరగాయల సాగుకు, పాడి పెంపకానికి ప్రభుత్వం నుండి రాయితీ ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఈ పంటలను కోతులు, అడవి పందులు వంటి వాటి బెడద నుండి కాపాడుకునేందుకు వీలుగా సోలార్ ఫెన్సింగ్ కోసం సబ్సిడీ అందించేలా చొరవ చూఫుతామని అన్నారు. కోతులు, అటవీ జంతువులు జనావాసాలలోకి రాకుండా అటవీ ప్రాంతాల్లో విరివిగా పండ్ల మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఉమ్మడి జిల్లాలోని జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవని, భూగర్భ జలాలు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి రైతుకు భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటి లభ్యత, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, వర్షాభావ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కడ కూడా తాగునీటి కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని, చుక్క నీరు కూడా వృధా కాకుండా ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని అన్నారు.
శాసన మండలి సభ్యులు బి.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఎల్ నినో పరిస్థితులు కొత్త కాకపోయినప్పటికీ, దాని ప్రభావం బారి నుండి రైతులను, ప్రజలను కాపాడేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇప్పటికే 45 శాతం లోటు వర్షపాతం నెలకొని ఉన్నందున ప్రతీకూల పరిస్తుతులను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను కార్యోన్ముఖులను చేశారు. ప్రస్తుత తరుణంలో పంటల వైవిధ్యం పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హితవు పలికారు. పరిస్థితులకు అనుగుణంగా పంట విధానాలలో మార్పులు చేయాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, కూరగాయలు, ఆరుతడి పంటల సాగు చేపడితే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఇదివరకటి తరహాలో ఉమ్మడి జిల్లాలో చెరకు పంటను ప్రోత్సహించే దిశగా, ఎన్.సీ.ఎస్.ఎఫ్ ఇతర చక్కర పరిశ్రమల పునరుద్ధరణ విషయమై దృష్టిని కేంద్రీకరిస్తామని అన్నారు.
ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను నిలువరించే శక్తి ఎవరికీ ఉండదని, అయితే ముందస్తుగానే అప్రమత్తమై ప్రత్యామ్నాయ కార్యాచరణను చేపడితే చాలా వరకు విపత్తు ద్వారా చేకూరే నష్టం నుండి బయటపడగల్గుతామని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అన్ని జిల్లాలలో ప్రత్యామ్నాయ కార్యాచరణ అమలుకై విస్తృత స్థాయిలో కృషి చేస్తోందని అన్నారు. వర్షాభావం వల్ల నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో పంటల మార్పిడి వైపు దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఆదర్శ రైతులు ఉన్నారని, ప్రతీకూల పరిస్థితులను ఎదుర్కోవడంలోనూ వారు సమర్ధులేనని అన్నారు. ఇప్పటికే 72 శాతం విస్తీర్ణంలో పంటలు విత్తుకున్నారని, అయితే మిగితా 28 శాతం విస్తీర్ణంలో ఆరుతడి పంటలు వేయాలని హితవు పలికారు. ఈ మేరకు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. శాఖల వారీగా ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించడమే కాకుండా, దానిని పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు సోక్ పిట్స్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పెద్ద ఎత్తున నిర్మించేలా చూడాలన్నారు.
నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశామని అన్నారు. పంటల మార్పిడి, ఆరుతడి పంటల సాగుపై రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వనరులతో అధిక ఆదాయాన్ని అందించే పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా అధికారులను సన్నద్ధం చేశామని అన్నారు.
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ప్రతీకూల పరిస్థితుల నేపధ్యంలో ఉద్యానవన పంటల సాగు వైపు దృష్టిని కేంద్రీకరిస్తే ఎంతో ప్రయోజనమని అన్నారు. కూరగాయలు, పప్పుదినుసులు, ఆయిల్ పామ్ వంటి పంటల సాగుకు ముందుకు రావాలని రైతులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు వల్ల తక్కువ నీటి వసతి, సులభమైన యాజమాన్య పద్ధతులతో దీర్ఘకాలం పాటు అధిక మొత్తం ఆదాయం పొందవచ్చని సూచించారు. అంతర పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉందని, ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రాయితీ అందిస్తోందని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, టి.లక్ష్మీకాంత్ రావు, పైడి రాకేశ్ రెడ్డిలు మాట్లాడుతూ, తమ నియోజకవర్గాలలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రైతులకు ఫసల్ బీమా వర్తించేలా చూడాలని, సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా భూగర్భ జలాలను పెంపొందించాల్సిన ఆవశ్యకతపై తెలంగాణ జలసిరి పేరిట రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.
సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్లు వి.భుజంగరావు, వెక్టర్, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీ.ఆర్.ఓ గీత, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
Posted On 2026-07-21 06:12:30
Readmore >
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Posted On 2026-07-21 04:16:53
Readmore >
తరగతులకు రోజూ హాజరుకావాలి.. ప్రణాళిక ప్రకారం చదవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-20 17:26:49
Readmore >
శబరిమల బంగారు దోపిడీ కేసులో తుది నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలి...
Posted On 2026-07-20 16:40:30
Readmore >
బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు... ప్రజల భద్రతే లక్ష్యంగా బాన్సువాడ పోలీసులు
Posted On 2026-07-20 16:14:17
Readmore >