| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం వీరభద్రపురం గ్రామ పరిధిలోని తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పరిశీలించి కాలువ పరిస్థితులు, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తాళిపేరు నదిపై చర్ల మండలం పెద్దమిడిసిలేరు వద్ద నిర్మించిన ఈ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ద్వారా సుమారు 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, ఎడమ కాలువ 46.46 కి.మీ పొడవుతో 34 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సుమారు 21,100 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ రైతులకు సాగునీరు అంతరాయం లేకుండా అందేలా కాలువల నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. కాలువల్లో పెరిగిన గడ్డి, చెత్త, మురుగును వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాలువ వెంబడి దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, నీటి పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కాలువల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు.

ఈ పరిశీలనలో దుమ్ముగూడెం తాసిల్దార్ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఈఈ జానీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Previous అర్బన్ పార్క్ సందర్శించిన విద్యార్థులు..
Next సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో
ADVERTISEMENT