బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా నగరంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనను బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు.చిన్నారి జీవితాన్ని ఛిద్రమయ్యేలా చేసిన ఇటువంటి దారుణాలకు నాగరిక సమాజంలో స్థానం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితుడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడైనా, ఎంతటి ప్రభావశీలుడైనా చట్టం ముందు తలవంచాల్సిందేనని స్పష్టం చేశారు నేరానికి పార్టీ రంగు ఉండదని, నేరస్థుడు కేవలం నేరస్థుడేనని ఆయన వ్యాఖ్యానించారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం, పూర్తి భద్రతతో పాటు న్యాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గిరిబాబు పేర్కొన్నారు.
ఘటనలో బాధ్యులైన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలాగే నిందితుడిని రక్షించేందుకు, దర్యాప్తును ప్రభావితం చేసేందుకు లేదా బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నించి ఉంటే, వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.నేరం చేసినవాడితో పాటు నేరస్థుడిని కాపాడే ప్రయత్నం చేసినవాడు కూడా చట్టం ముందు జవాబు చెప్పాల్సిందేననే సందేశం సమాజానికి వెళ్లాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి తన పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ, బాధితురాలికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు