కాకినాడలో దారుణం.. ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు హత్య
డైలీ భారత్, కాకినాడ: కాకినాడ నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు.
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాధితుడు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దుండగులు దాడికి పాల్పడినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పాత కక్షల కారణంగానా లేక వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో జరిగిందా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
మృతుడు జి. నాగేశ్వరరావు (46)గా గుర్తించారు. ఆయన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.