| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

450 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం

నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు

జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) కింద పంపిణీ అయ్యే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమన్వయ దాడుల్లో మొత్తం 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

శనివారం తెల్లవారుజామున సుమారు 1.45 గంటల సమయంలో సివిల్ సప్లై అధికారులు, పోలీస్ విభాగం కలిసి నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో భాగంగా ఇల్లెందు మండలం రేపల్లెవాడలోని కోట మైసమ్మ గుడి సమీపంలో అక్రమంగా వాహనాలకు ఎక్కిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక లారీ, ఒక బొలెరో వాహనాలను కూడా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు

అదేవిధంగా టేకులపల్లి మండలంలో మరో ఘటనలో సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రానికి తరలించే ప్రయత్నంలో ఉన్న లారీని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి మళ్లించేందుకు యత్నించినట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు తెలిపారు.

ఈ రెండు ఘటనలపై సవివర విచారణ కొనసాగుతోందని, సంబంధిత నిందితులపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (TSPDS) కంట్రోల్ ఆర్డర్ నిబంధనలు మరియు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని అదనపు కలెక్టర్ తెలిపారు .

ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని దారి మళ్లించడం అత్యంత తీవ్రమైన నేరమని, ఇందులో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర తనిఖీలు, దాడులు కొనసాగుతాయని తెలిపారు.

ఈ దాడుల్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, సివిల్ సప్లై అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై సమాచారం అందించేందుకు ముందుకు రావాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.

Previous అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Next గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
ADVERTISEMENT