| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఒడిశా నుండి మహారాష్ట్రకు 112 కిలోల గంజాయి... బ్రేక్‌డౌన్ అయిన కారుతో దొరికిపోయిన ముఠా...

ఒడిశా నుండి మహారాష్ట్రకు 112 కిలోల గంజాయి... బ్రేక్‌డౌన్ అయిన కారుతో దొరికిపోయిన ముఠా...

డైలీ భారత్, సూర్యాపేట: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టు చేశారు. సూర్యాపేట II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 112 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు.

ఎలా జరిగిందంటే?

మహారాష్ట్రకు చెందిన ఐదుగురు వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు పథకం రూపొందించారు. ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ఒడిశా రాష్ట్రంలోని జగన్నాథపురి ప్రాంతానికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలో రూ.2,000 చొప్పున మొత్తం 112 కిలోల గంజాయిని రూ.2.24 లక్షలకు కొనుగోలు చేశారు.

అనంతరం గంజాయిని 41 ప్యాకెట్లుగా తయారుచేసి ఇన్నోవా కారులో లోడ్ చేసి మహారాష్ట్రకు తరలించేందుకు బయలుదేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మరో ఎర్టిగా కారును ఎస్కార్ట్‌గా ముందు నడుపుతూ, పోలీసుల కదలికలను గమనిస్తూ వెనుక వస్తున్న ఇన్నోవా వాహనానికి సమాచారం అందించేవారు.

ఈ క్రమంలో నవంబర్ 7వ తేదీన సూర్యాపేట పట్టణ శివారులోని NH-65 జాతీయ రహదారిపై పద్మావతి ఫంక్షన్ హాల్ సమీపంలో ఇన్నోవా కారు బ్రేక్‌డౌన్ అయింది. దీంతో నిందితులు వాహనాన్ని రహదారి పక్కన వదిలి పరారయ్యారు.

అనుమానాస్పదంగా కారు నిలిపి ఉన్నట్లు సమాచారం అందడంతో సూర్యాపేట II టౌన్ ఎస్సైలు కె. గోపికృష్ణ, బి. రామచంద్రం సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని తనిఖీ చేయగా, 41 ప్యాకెట్లలో 112 కిలోల గంజాయి గుర్తించారు. వెంటనే పంచుల సమక్షంలో గంజాయితో పాటు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా వాహనాన్ని తిరిగి తీసుకెళ్లేందుకు నవంబర్ 12వ తేదీన సూర్యాపేటకు వచ్చిన ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన నిందితులు:

1. ఆకాష్ విజయ్ దాబేకర్ (23), బీడ్ జిల్లా, మహారాష్ట్ర.

2. ఆకాష్ దిలీప్ మోరే (32), బుల్దానా జిల్లా, మహారాష్ట్ర.

వీరి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని, ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.

ఎస్పీ హెచ్చరిక:
గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ఏమాత్రం ఉపేక్షించేది లేదు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ వెంకటయ్య, సిబ్బంది ఎస్ఐలు గోపికృష్ణ, రామచందర్ ఉన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సూర్యాపేట II టౌన్ ఎస్సైలు కె. గోపికృష్ణ, రామచందర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు, కానిస్టేబుళ్లు కొండా రమేష్, ఎన్. నవీన్‌లను ఎస్పీ అభినందించారు.

#DailyBharath #Suryapet #Ganja #TelanganaPolice #DrugFree

Previous భార్యాభర్తల గొడవలకు కారణం ఇదే... ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తోనే పరిష్కారం అంటున్న సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Next ఇరిగేషన్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు... బయటపడింది 7 కోట్ల ఆస్తులు! 50 తులాల బంగారం, 5 కార్లు!
ADVERTISEMENT