| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చెరువును కాపాడాల్సిన అధికారులే చెరువుకు గండి కొట్టారా!

చెరువును కాపాడాల్సిన అధికారులే చెరువుకు గండి కొట్టారా!

దొంతికుంటను కబ్జాల పాలు చేసి రూ.5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ హడావుడి!

డైలీ భారత్, అశ్వారావుపేట:చెరువులను కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే చెరువుల పాలిట శాపంగా మారుతోందా! ఆక్రమణలను అరికట్టి జలవనరుల అస్తిత్వాన్ని కాపాడాల్సిన అధికారులే వాటి విధ్వంసానికి పరోక్షంగా సహకరిస్తున్నారా! అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నా, ఆ అభివృద్ధికి పునాది కావాల్సిన చెరువు భూమి, నీటి ప్రవాహ మార్గాలు, పంట కాలువలను కాపాడాలన్న కనీస బాధ్యత ఎందుకు కనిపించడం లేదు! అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువును చూస్తే ఇలాంటి ప్రశ్నలు అనేకం తలెత్తుతున్నాయి.

సుమారు 23 ఎకరాల 38 గుంటల విస్తీర్ణం కలిగిన దొంతికుంట చెరువు నేడు ఆక్రమణల చెరలో చిక్కుకుని తన అసలు స్వరూపాన్ని కోల్పోయే దుస్థితికి చేరుకుంది. ఒకప్పుడు పట్టణానికి, ఆయకట్టు రైతాంగానికి జీవనాధారంగా నిలిచిన ఈ జలవనరు నేడు అధికారుల నిర్లక్ష్యం, ఆక్రమణల పర్వం, ప్రణాళికలేని అభివృద్ధి పనులతో ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

ఆక్రమణలు అధికారులకు కనిపించవా!

2005లో అప్పటి ప్రభుత్వం నీరు మీరు కార్యక్రమంలో భాగంగా దొంతికుంట చెరువును సుందరీకరించి మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అయితే చెరువు అభివృద్ధి పేరుతో మొదలైన కార్యక్రమం కాలక్రమంలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితికి దారితీసిందనే ఆరోపణలు ఉన్నాయి. చెరువు అసలు విస్తీర్ణం ఎంత! ప్రస్తుతం ఎంత భూమి మిగిలింది! ఎంత మేర ఆక్రమణకు గురైంది! చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ ఛానళ్లు ఎక్కడ ఉన్నాయి! నీరు బయటకు వెళ్లే మోరీలు, పంట కాలువల పరిస్థితి ఏమిటి! అనే ప్రాథమిక అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రజల ముందు వాస్తవాలు ఉంచాల్సిన బాధ్యత అధికారులపై లేదా! కానీ ఆక్రమణల తొలగింపుపై స్పష్టమైన చర్యలు కనిపించకపోగా, చెరువు కట్టను ఆనుకుని వ్యాపార సముదాయాలు, చెరువు పరిధిలోనూ, నీటి ప్రవాహ మార్గాల్లోనూ నిర్మాణాలు వెలుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.5 కోట్ల అభివృద్ధి, అసలు సమస్యలకు పరిష్కారం ఎక్కడ!

దొంతికుంట చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల రూ.5 కోట్ల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ అభివృద్ధి కార్యక్రమంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కోట్లాది రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ నిర్మించే ముందు చెరువు అసలు విస్తీర్ణాన్ని పరిరక్షించారా! ఆక్రమణలను గుర్తించారా! పట్టణంలోని వర్షపు నీరు చెరువులోకి చేరే మార్గాలను పునరుద్ధరించారా! చెరువులో నిల్వ ఉండే నీటిని కిందనున్న ఆయకట్టు పొలాలకు అందించే కాలువలను పునర్నిర్మించారా!

చెరువును సుందరీకరించడం అంటే కేవలం కట్టపై వాకింగ్ ట్రాక్ లు, ఇతర అలంకరణ పనులు చేపట్టడం మాత్రమే కాదు. చెరువుకు నీరు వచ్చే మార్గాలను కాపాడటం, నీటిని నిల్వ ఉంచడం, అవసరమైనప్పుడు ఆయకట్టుకు అందించడం, వరద నీరు సురక్షితంగా వెళ్లే మార్గాలను ఏర్పాటు చేయడం అసలైన అభివృద్ధి.

కాలువలు కబ్జా, రైతుల సాగునీటికి శాపం!

దొంతికుంట చెరువుకు సంబంధించిన పంట కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఆరోపణలు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువు నుంచి ఆయకట్టు పొలాలకు నీరు వెళ్లాల్సిన కాలువలపైనే రియల్ ఎస్టేట్ లేఔట్లు, ఇతర నిర్మాణాలు వెలుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. కాలువలు లేకుండా పోతే చెరువులో నీరు ఉన్నా రైతులకు ఉపయోగం ఏమిటి! సాగునీరు అందించాల్సిన కాలువలే కనుమరుగైతే ఆయకట్టు వ్యవస్థ ఎలా బతుకుతుంది!

ముసురు తుఫాను బయటపెట్టిన ఆక్రమణల బాగోతం!

ఇటీవల కురిసిన ముసురు తుఫాను వర్షాలు దొంతికుంట చెరువు వాస్తవ పరిస్థితిని మరోసారి బయటపెట్టాయి. పట్టణంలోని వర్షపు నీరు చెరువులోకి చేరే పరిస్థితి, అక్కడి నుంచి నీరు బయటకు వెళ్లే మార్గాల కొరత కారణంగా గుర్రాల చెరువు రోడ్డు, గౌడ్ బజారు, మంగళ బజారు తదితర ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడింది.

చెరువుకు గండి కొట్టడం పరిష్కారమా! బాధ్యత ఎవరిది!

పట్టణంలోని కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయనే కారణంతో దొంతికుంట చెరువుకు భారీ స్థాయిలో గండి కొట్టిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెరువులను కాపాడాల్సిన అధికారులే చెరువుకు గండి కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది! ముందస్తు వరద నిర్వహణ ప్రణాళికలు ఏమయ్యాయి! ఈ చర్యకు సంబంధించి ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారా! ఇరిగేషన్ శాఖ సాంకేతిక పరిశీలన చేసిందా!

ఇప్పటికైనా కళ్లు తెరవాలి, దొంతికుంటను కాపాడాలి!

భవిష్యత్తులో అశ్వారావుపేట పట్టణం వరద ముప్పును ఎదుర్కోకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని, దొంతికుంట చెరువు 23 ఎకరాల 38 గుంటల అసలు విస్తీర్ణాన్ని అధికారిక రికార్డులతో సరిపోల్చి రీ సర్వే నిర్వహించాలని, ఆక్రమణలకు గురైన చెరువు భూములను గుర్తించి చట్ట ప్రకారం తొలగించాలని, చెరువుకు నీరు వచ్చే ఫీడర్ ఛానళ్లు, బయటకు వెళ్లే వరద కాలువలు, ఆయకట్టు పంట కాలువలను పునరుద్ధరించాలని, చెరువుకు గండి కొట్టిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, రూ.5 కోట్లతో చేపడుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను కేవలం సుందరీకరణకే పరిమితం చేయకుండా చెరువు పరిరక్షణ, వరద నియంత్రణ, సాగునీటి సరఫరా అనే మూడు ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టాలని అశ్వారావుపేట ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

చెరువు ఉంటేనే నీరు, నీరు ఉంటేనే రైతు, రైతు ఉంటేనే పట్టణానికి జీవం!

#DailyBharath #Aswaraopet #DonthikuntaCheruvu #MiniTankBund #SaveCheruvu

Previous సిరిసిల్లలో బాల్యవివాహాలపై యుద్ధం! పోస్టర్ ఆవిష్కరించిన డీఎస్పీ!
Next కామారెడ్డిలో పోలీసుల స్పెషల్ డ్రైవ్! నంబర్ ప్లేట్ లేకపోతే అక్కడికక్కడే ఫైన్!
ADVERTISEMENT