సిరిసిల్ల 33వ వార్డులో సొంత ఖర్చులతో పైప్ లైన్ మరమ్మతులు..
కౌన్సిలర్ పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగిన వార్డు వాసులు!
డైలీ భారత్, సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డులో కాలనీవాసులు తమ సొంత ఖర్చులతో పాడైపోయిన తాగునీటి పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టి తిరిగి నీటి సరఫరాను పునరుద్ధరించుకున్నారు.
గతంలో కాలనీలోని బోరు మోటార్ ద్వారా పైప్ లైన్ సహాయంతో ఇళ్లకు నీటి సరఫరా జరిగేది. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఈ పైప్ లైన్ ద్వారా అందించే నీరు కాలనీవాసులకు ఎంతగానో ఉపయోగపడేది.
అయితే కొంతకాలంగా పైప్ లైన్ పలు చోట్ల పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించి తిరిగి నీటి సరఫరా ప్రారంభించాలని స్థానిక కౌన్సిలర్ కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు కోరినా స్పందన లేకపోవడంతో చివరకు వారే స్వయంగా రంగంలోకి దిగారు. తమ సొంత డబ్బులతో మరమ్మతు పనులు చేపట్టి, పారలతో తవ్వకాలు జరిపి పాడైన పైప్ లైన్ ను బాగు చేసుకున్నారు. దీంతో నిలిచిపోయిన నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది.
ప్రజల కనీస అవసరమైన తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో ప్రజలే సొంత ఖర్చులతో పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు కాలనీలోని నీటి సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
#DailyBharath #Sircilla #RajannaSircilla #WaterProblem #MissionBhagiratha