| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

సేవా కార్యక్రమాలను అభినందించిన ఎమ్మెల్యే

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి: సమాజ సేవలో 16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై ట్రస్ట్ నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను పరిశీలించి అభినందించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వహిస్తున్న మహిళా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మరియు జీవనోపాధి కల్పన కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ,

“KRK Sunshine Charitable Trust చేస్తున్న సేవా కార్యక్రమాలు నిజంగా అభినందనీయం. ముఖ్యంగా మహిళలకు నైపుణ్యాలను నేర్పించి, వారి జీవనోపాధికి తోడ్పడటం గొప్ప విషయం. మీరు ఇక్కడ నేర్చుకున్న ప్రతి నైపుణ్యం చాలా ముఖ్యమైనది. మీరు నేర్చుకున్నదాన్ని కేవలం మీ దగ్గరే ఉంచుకోకుండా, మరొకరికి కూడా నేర్పించాలి. మీరు నేర్చుకున్న నైపుణ్యం మరొకరి జీవితాన్ని మార్చేలా నిరంతరం సాధన చేస్తూ ముందుకు వెళ్లాలి.” అని అన్నారు.

అలాగే ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు.

“ఈ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమైనవి. మీకు ఎప్పుడు నా సహాయం అవసరమైనా, నేను మీతో ఉంటాను. నా పరిధిలో చేయగలిగిన సహాయాన్ని తప్పకుండా అందిస్తాను” అని ఎమ్మెల్యే తెలిపారు.

ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఖలీల్‌ఉల్లా చేస్తున్న సేవలను కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా అభినందించారు.

“ఇతరుల కోసం తన సమయాన్ని, శక్తిని కేటాయిస్తూ సేవ చేయడం ఒక గొప్ప సత్కార్యం. మొహమ్మద్ ఖలీల్‌ఉల్లా గారు ప్రజల కోసం చేస్తున్న ఈ సేవ ఒక గొప్ప నోబుల్ కాజ్. ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన తల్లికి కూడా గర్వకారణం” అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

16 సంవత్సరాల సేవా ప్రస్థానం

KRK Sunshine Charitable Trust గత 16 సంవత్సరాలుగా మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, మెహందీ, బ్యూటీషియన్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ నైపుణ్యాలలో శిక్షణ, జీవనోపాధి సహాయం, “No Hungry Child” కార్యక్రమం ద్వారా పేద పిల్లలకు ఆహారం, రేషన్ పంపిణీ, వేసవి మరియు చలికాల సహాయ కార్యక్రమాలు, వైద్య సహాయం, విద్యా సహాయం, వృద్ధులకు సహాయం, న్యాయ అవగాహన మరియు కమ్యూనిటీ మెడియేషన్ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

మహిళలకు కేవలం సహాయం అందించడం కాకుండా, వారికి ఒక నైపుణ్యాన్ని నేర్పించి, ఆ నైపుణ్యంతో వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ట్రస్ట్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది.

ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు మొహమ్మద్ ఖలీల్‌ఉల్లా మాట్లాడుతూ,

“16 సంవత్సరాల మా సేవా ప్రయాణంలో మేము సాధించిన గొప్ప విజయం భవనాలు లేదా కార్యక్రమాల సంఖ్య కాదు. ఒక మహిళ తనకు తాను ఉపాధి పొందడం, ఒక పిల్లవాడు ఆకలితో కాకుండా భోజనం చేసి చదువుకోవడం, ఒక అవసరమైన కుటుంబానికి కష్ట సమయంలో అండగా నిలబడటం — ఇవే మా నిజమైన విజయాలు.” అని అన్నారు.

“సేవ అనేది కేవలం సహాయం చేయడం కాదు… ఒక మనిషిలో ఆశను నింపడం. ఒక నైపుణ్యాన్ని నేర్పడం కాదు… ఆ నైపుణ్యంతో మరొకరి జీవితాన్ని మార్చే అవకాశం ఇవ్వడం.” అని ఆయన పేర్కొన్నారు.

16 సంవత్సరాల సేవా ప్రస్థానం తమకు ముగింపు కాదని, మరింత మంది మహిళలకు నైపుణ్యాలు, మరింత మంది పిల్లలకు సహాయం, మరింత మంది కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పించే కొత్త ప్రారంభం అని తెలిపారు.

ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం, ప్రజల సహకారం, స్వచ్ఛంద కార్యకర్తలు, దాతలు మరియు శ్రేయోభిలాషుల అండతో భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

“ఒక నైపుణ్యం నేర్చుకున్నప్పుడు ఒక జీవితం మారుతుంది…

ఆ నైపుణ్యాన్ని మరొకరికి నేర్పినప్పుడు ఒక కుటుంబం మారుతుంది…

సేవలో మనసు కలిసినప్పుడు ఒక సమాజం మారుతుంది.”

Previous గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Next ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు
ADVERTISEMENT