భద్రాద్రి కొత్తగూడెం/అశ్వాపురం, ( డైలీ భారత్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బస్సు కోసం వేచి ఉన్న ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన 60 ఏళ్ల వృద్ధుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
అశ్వాపురం మండలం బుడుగు బజార్ కు చెందిన 16 ఏళ్ల బాలిక భద్రాచలంలో ఇంటర్ చదువుతోంది. కాలేజీకి వెళ్లేందుకు రామచంద్రాపురం బస్టాప్ వద్ద ఒంటరిగా బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే మార్గంలో బైక్ పై వచ్చిన అదే గ్రామానికి చెందిన రాయల కోటయ్య (60) "ఇంటి దగ్గర దింపుతా" అంటూ నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు.
అయితే గ్రామానికి తీసుకెళ్లకుండా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక ధైర్యంగా ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగింది చెప్పింది.
పోక్సో కేసు నమోదు
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అశ్వాపురం పోలీసులు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన తర్వాత గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మరో 14 మందిపై కూడా కేసులు పెట్టారు.
విద్యార్థినుల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.