రోడ్డు ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి
డైలీ భారత్, ములకలపల్లి: పాల్వంచ నుంచి దమ్మపేట,మందలపల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై రాజుపేట వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు అన్నారు.ములకలపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాజుపేట బ్రిడ్జి వద్ద సైడ్ డైవర్షన్‌ను కచ్చితంగా ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున ప్రయాణికులు, వాహనదారుల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణమే తాత్కాలిక డైవర్షన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు.అలాగే కూలిన బ్రిడ్జికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని తాటి వెంకటేశ్వర్లు అధికారులను కోరారు.