జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన దివ్యాంగులు.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ఐదుగురు దివ్యాంగుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సత్వరం స్పందించి.. వారి సమస్యకు పరిష్కారం చూపారు.
కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన లింగంపల్లి లక్ష్మి, వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ కు చెందిన నాగుల అశోక్, కోనరావుపేట మండలం సుద్దాల కు చెందిన కుడుకల దేవయ్య, కోనరావుపేట మండలం నిమ్మపల్లి కి చెందిన ఇద్దగిరి లక్ష్మణ్, తంగళ్లపల్లి మండలం నర్సిములపల్లికి చెందిన సోమురెడ్డి రాజు దివ్యాంగులు సోమవారం ఐడీఓసీకి రాగా, వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సమస్యపై వచ్చారో అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందిని తెలుసుకొని తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వారికి బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. వారికి వెంటనే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు, హెల్మెట్ జిల్లా కలెక్టర్ అందజేశారు. తమ సమస్య, ఇబ్బందులను అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు అందజేసిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు.