హోదా చిహ్నాలు అలంకరించిన జిల్లా ఎస్పీ
• పదోన్నతులు బాధ్యతలను మరింత పెంచుతాయి – నూతన ఏఎస్ఐలకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు
• నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి గుర్తింపు తప్పనిసరి – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI)లుగా పదోన్నతి పొందిన ఇద్దరు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి, నూతన హోదా చిహ్నాలను అలంకరించారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పండరి గౌడ్, తాడ్వాయి పోలీస్ స్టేషన్‌కు చెందిన వై. రాజేందర్‌లు హెడ్ కానిస్టేబుల్ హోదా నుంచి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేయగా, ఎస్పీ వారికి నూతన హోదా చిహ్నాలను అలంకరించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS మాట్లాడుతూ, పోలీస్ శాఖలో పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా, మరింత బాధ్యతాయుతమైన సేవలను అందించేందుకు అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
పోలీస్ శాఖలో కష్టపడి, నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం మరియు పదోన్నతులు తప్పకుండా లభిస్తాయని ఎస్పీ గారు పేర్కొన్నారు. పదోన్నతి పొందిన అధికారులు తమ నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శాఖకు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.