| Daily భారత్
Logo




ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తో సత్ఫలితాలు

News

Posted on 2026-05-12 20:03:37

Share: Share


ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తో సత్ఫలితాలు

సైకాలజిస్టుల మద్దతుతో భార్యాభర్తల మధ్య విభేదాలకు శాస్త్రీయ పరిష్కారం

వ్యాసకర్త: కనుకుంట్ల పున్నంచందర్, సైకాలజిస్ట్, TPA రాష్ట్ర ఉపాధ్యక్షుడు

(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

డైలీ భారత్, స్పెషల్: ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ అనేక మార్పులను ఎదుర్కొంటోంది. వేగవంతమైన జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు, పరస్పర అపార్థాలు, కోపం, ఈగో, కమ్యూనికేషన్ లోపం, "మితిమీరిన స్వేచ్ఛ" "నాకు అన్ని తెల్సు అనే భావన" వంటి కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలపై ప్రారంభమైన గొడవలు కొన్నిసార్లు కుటుంబ బంధాలను దెబ్బతీసి, విడాకులకు, పిల్లల మానసిక సమస్యలకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ మరియు సైకాలజిస్ట్ పాత్ర ఎంతో కీలకంగా మారుతోంది.

"ఫ్యామిలీ కౌన్సెలింగ్ "

ఫ్యామిలీ కౌన్సెలింగ్ అనేది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న భావోద్వేగ, మానసిక, ప్రవర్తనా సమస్యలను అర్థం చేసుకుని వాటికి సరైన పరిష్కార మార్గాలను చూపించే ఒక శాస్త్రీయ విధానం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరచడం, పరస్పర అవగాహన పెంచడం, కుటుంబ బంధాలను బలపరచడం దీని ప్రధాన లక్ష్యం.

"నేను చెప్పిందే సరైంది అనే భావన" 

 “నేను చెప్పిందే సరైంది” అనే భావన సమస్యలను మరింత పెంచుతుంది. కానీ విజయవంతమైన దాంపత్య జీవితానికి ముఖ్యమైన అంశం "ఎదుటి వ్యక్తి కోణంలో ఆలోచించడం"

భర్త ఎదుర్కొంటున్న ఒత్తిడిని భార్య అర్థం చేసుకోవాలి. అలాగే భార్య భావోద్వేగాలను భర్త గౌరవించాలి. పరస్పర సహానుభూతి కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది.

చాలా కుటుంబాల్లో గత విషయాలను పదే పదే గుర్తు చేస్తూ గొడవలు కొనసాగుతుంటాయి. సమస్య ఎవరిది? అనే దానికంటే సమస్యకు పరిష్కారం ఏమిటి? అనే దానిపై దృష్టి పెట్టాలి. ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి మాట మరొకరు వినడం, తప్పులను అంగీకరించడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలు కుటుంబ జీవితాన్ని సంతోషంగా మార్చగలవు.

"కమ్యూనికేషన్ లోపాలే బంధాలను బహీనపరుస్తున్నాయి"

ఈగో మరియు అపార్థాలు దాంపత్య జీవితాన్ని బలహీనపరుస్తాయి. “ముందుగా నేనే ఎందుకు మాట్లాడాలి?”, “క్షమాపణ నేను ఎందుకు చెప్పాలి?” అనే ఆలోచనలు సంబంధాలను దెబ్బతీస్తాయి. చాలాసార్లు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే అపార్థాలు పెరుగుతాయి. కోపంలో మాట్లాడిన మాటలు జీవితాంతం గాయాలుగా మిగిలిపోవచ్చు. అందుకే ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. వెంటనే స్పందించకుండా, సరైన సమయంలో ప్రశాంతంగా మాట్లాడుకోవడం సమస్యలను తగ్గిస్తుంది.

"కుటుంబ జీవితం ఇద్దరి బాధ్యత"

ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, ఆర్థిక బాధ్యతలు వంటి అంశాలను భార్యాభర్తలు కలిసి పంచుకుంటే పరస్పర గౌరవం పెరుగుతుంది. “మన కుటుంబం” అనే భావన బలపడుతుంది.

భార్యాభర్తల మధ్య తరచూ జరిగే గొడవలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పిల్లలు కుటుంబ వాతావరణాన్ని ఎంతో సున్నితంగా గమనిస్తారు. కుటుంబంలో శాంతి లేకపోతే పిల్లల్లో భయం, ఆందోళన, ఒత్తిడి, ఆత్మవిశ్వాస లోపం, చదువుపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొంతమంది పిల్లలు మౌనంగా మారిపోతారు. మరికొందరు కోపంగా ప్రవర్తిస్తారు. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, భద్రత ఉన్నప్పుడు మాత్రమే పిల్లల భావోద్వేగ, మానసిక, సామాజిక ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉంటుంది.

ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో సైకాలజిస్ట్ పాత్ర అత్యంత ముఖ్యమైనది. 

"ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో సైకాలజిస్ట్"

 సైకాలజిస్టులు కుటుంబ సభ్యుల భావోద్వేగాలను అర్థం చేసుకుని సమస్యల మూల కారణాలను గుర్తిస్తారు. బయట కనిపించే గొడవల వెనుక అనుమానం, నిరాశ, ఆత్మవిశ్వాస లోపం, కోప నియంత్రణ లోపం, భావోద్వేగ నిర్లక్ష్యం వంటి అంశాలు ఉండవచ్చు. సైకాలజిస్ట్ ఈ అంశాలను విశ్లేషించి సరైన మార్గదర్శకాన్ని అందిస్తారు.

భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరచడంలో కూడా సైకాలజిస్ట్ కీలక పాత్ర పోషిస్తారు. ఒకరి మాట మరొకరు గౌరవంగా వినడం, భావాలను సరైన రీతిలో వ్యక్తపరచడం, సమస్యలను ప్రశాంతంగా చర్చించడం వంటి నైపుణ్యాలను నేర్పిస్తారు. అవసరమైతే CBT, Stress Management, Anger Management వంటి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి భావోద్వేగ నియంత్రణను పెంపొందిస్తారు.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.

 "మూడవ వ్యక్తి పాత్ర చాలా జాగ్రత్త" 

భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో కుటుంబ పెద్దలు, బంధువులు, పరిచయస్తులు "తమ వ్యక్తిగత అభిప్రాయాలు, ఈగోలు, పక్షపాత ధోరణులతో" సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కానీ దాంతో సమస్యలు తగ్గకపోగా మరింత పెరిగిన సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి.

కొన్ని సందర్భాల్లో పెద్దమనుషుల జోక్యం వల్ల అపార్థాలు మరింత పెరిగి, ఒకరి మీద మరొకరికి ద్వేషం పెరగడం, కుటుంబాలు విడిపోవడం, పిల్లలు మానసికంగా దెబ్బతినడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలాసార్లు సమస్య పరిష్కార దిశగా వెళ్లాల్సిన కుటుంబాలు, వ్యక్తిగత ఈగోలు మరియు పక్షపాత ధోరణుల కారణంగా మరింత దూరమవుతున్నాయి.

"భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తిగా ఉండాల్సింది కేవలం శిక్షణ పొందిన మనోవికాస నిపుణుడు లేదా సైకాలజిస్ట్ మాత్రమే"

 సైకాలజిస్ట్ వ్యక్తిగత పక్షపాతం లేకుండా, శాస్త్రీయ దృక్పథంతో, గోప్యతను కాపాడుతూ సమస్యలను విశ్లేషిస్తారు. "ఎవరు గెలవాలి" అనే దానికంటే "కుటుంబ బంధం ఎలా నిలవాలి" అనే దానిపై దృష్టి పెడతారు.

సైకాలజిస్ట్ కుటుంబ సభ్యుల్లో పరస్పర గౌరవం, విశ్వాసం, సహనం పెంపొందించేలా సహాయం చేస్తారు. ముఖ్యంగా పిల్లలపై గొడవల ప్రభావం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. కుటుంబ సభ్యులు కలిసి సమయం గడపడం, భావాలను పంచుకోవడం, ఒకరికి ఒకరు మానసికంగా అండగా నిలవడం వంటి అంశాలను ప్రోత్సహిస్తారు.

"అన్యోన్య దాంపత్యం అంటే"

 కేవలం కలిసి జీవించడం కాదు. ఒకరినొకరు గౌరవించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం, పరస్పర మద్దతు ఇవ్వడం. ప్రేమ, విశ్వాసం, సహనం, క్షమించే గుణం ఉన్నప్పుడు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

కుటుంబంలో సమస్యలు రావడం సహజం. కానీ వాటిని అర్థం చేసుకుని పరిష్కరించుకోవడం ఎంతో ముఖ్యమైనది. ఈగో, అపార్థాలు, కోపం, అనుమానాలు వంటి ప్రతికూల భావాలను దూరం చేసి పరస్పర గౌరవం, ప్రేమ, సహనం పెంపొందించుకోవాలి. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో సైకాలజిస్ట్ పాత్ర కుటుంబాలను మళ్లీ కలిపే వంతెనలా ఉంటుంది.

ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణం సమాజానికి బలమైన పునాది. అన్యోన్య దాంపత్యం, పరస్పర అవగాహన, భావోద్వేగ మద్దతు ఇవే సంతోషకరమైన కుటుంబ జీవనానికి నిజమైన ఆధారాలు.

గెలిస్తే ఇద్దరు..ఓడితే అందరు...ఇది కేవలం భార్యాభర్తల బంధాలలో మాత్రమే మనకు కనిపిస్తుంది.

"ఇద్దరు గెలవాలి..పిల్లలు నిలవాలి"

వ్యాస కర్త: కె. పున్నంచందర్, సైకాలజిస్ట్, సిరిసిల్ల

Msc Psychology, MSW (Medical and Psychiatry) LLB

Image 1

భద్రాచలంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

Posted On 2026-05-12 20:40:46

Readmore >
Image 1

ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తో సత్ఫలితాలు

Posted On 2026-05-12 20:03:37

Readmore >
Image 1

పేకాట స్థావరంపై పోలీస్ మెరుపు దాడి..

Posted On 2026-05-12 19:44:50

Readmore >
Image 1

షాద్‌నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదన

Posted On 2026-05-12 19:30:43

Readmore >
Image 1

పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Posted On 2026-05-12 19:21:38

Readmore >
Image 1

పశువుల అక్రమ రవాణా దారుల అరెస్ట్

Posted On 2026-05-12 19:20:10

Readmore >
Image 1

నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు

Posted On 2026-05-12 19:17:14

Readmore >
Image 1

మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...

Posted On 2026-05-12 19:11:46

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...

Posted On 2026-05-12 19:10:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా..

Posted On 2026-05-12 19:01:13

Readmore >