డైలీ భారత్, వేములవాడ: రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ వారి నిబంధనలు సరిగ్గా పాటించడం లేదనే కారణంతో వేములవాడ పట్టణంలోని చాణక్య నర్సింగ్ హోమ్ ను మంగళవారం జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రజిత మాట్లాడుతూ ఆస్పత్రి నిర్వాహకులు నిర్వహణలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించలేదని, భవన నిర్మాణ అనుమతి సైతం ఆసుపత్రి నిర్వహణకు చెల్లుబాటు అయ్యేలా లేదని, రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో భవనానికి సంబంధించిన పత్రాలు జమ చేయలేదని అన్నారు. అట్లాగే ఆసుపత్రికి కావాల్సిన కనీస 40ఫీట్ల అప్రోచ్ రోడ్డు లేదని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం వెళ్లేందుకు వీలు లేదని, అన్నింటికంటే ముఖ్యంగా నర్సింగ్ హోమ్ కు సంబంధించిన మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సైతం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి ఉండాల్సింది పోయి షేక్ సుహైల్ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నుండి తీసుకున్నారని, అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆసుపత్రి తాత్కాలిక రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఇదే విషయంపై ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ వ్యక్తిగత కక్షతో పాటు రాజకీయ కోణంలో ఆస్పత్రిని సీజ్ చేశారని, పట్టణంలో చాలా ఆసుపత్రులు నిబంధనలు పాటించినప్పటికీ కేవలం తమ ఆసుపత్రినే లక్ష్యంగా చేసుకొని అధికారులు సీజ్ చేశారని ఇది చట్ట విరుద్ధమని, అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ విషయంలో న్యాయస్థానలను ఆశ్రయిస్తామని తెలిపారు. మరోవైపు ఆసుపత్రి సీజ్ చేస్తున్న విషయం తెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో పాటు బి.ఆర్.ఎస్ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకొని అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు.
News
నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని వేములవాడ పట్టణంలోని చాణక్య నర్సింగ్ హోమ్ సీజ్