కోలాటాలతో నృత్యాలు చేసిన నర్సులు
పేషేంట్ల రూమ్ పక్కనే నృత్యాలు
కప్పిపుచ్చే యత్నం చేసిన ఆర్ఎంఓ సుమన్
సిబ్బంది, స్టాఫ్ రిక్వెస్ట్ చేయటంతో అనుమతించామంటున్న ఆర్ఎంవో సుమన్
విషయం తెలిసి ఆస్పత్రిలో విచారణ జరిపిన అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి
తక్షణమే విచారణ జరిపి చర్యలకు ఆదేశం
డైలీ భారత్, జగిత్యాల: డ్యూటీ టైంలో రోగులను గాలికి వదిలేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని కొందరు నర్సులు చిందులు వేశారు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో ఎక్కువ సౌండ్ పెట్టి డ్యాన్స్ ప్రోగాం మొదలు పెట్టారు.పేషంట్స్ ఉన్న వార్డుల మధ్యలో గల రూమ్ నుంచి డిస్టబెన్స్ రావడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రి ఆర్ఎంఓ సుమన్ కు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆరా తీసేందుకు వెళ్లిన మీడియా సిబ్బంది ఆర్ఎంఓ సుమన్ ను వివరణ కోరగా ముందస్తు క్రిస్మస్ వేడుకలలో భాగంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేందుకు తానే పర్మీషన్ ఇచ్చినట్లు తెలిపారు. రోగులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో ఖాళీగా ఉన్నారనే అనుమతి ఇచ్చినట్లు నర్సులకు వత్తాసు పలికారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా పూజలు చేశామని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అంటూ విషయాన్ని పెద్దది చేయొద్దని మాట్లాడారు. డ్యూటీ టైం లో ఆస్పత్రి ఆవరణలో ఇలాంటివి చేయకూడదంటూనే డ్యాన్స్ ప్రాక్టీస్ కు తానే అనుమతులు ఇచ్చానని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై వీహెచ్పీ నాయకులు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములుకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. డ్యూటీ టైంలో డ్యాన్సులు చేసిన వారిపై ఎంక్వయిరీల పేరుతో కాలయాపన చేయకుండా శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ కు ఆదేశించారు. పేషంట్లను పట్టించుకోకుండా డ్యూటీ టైం లో అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యాన్సులు చేయడం ఏంటని, అనుమతులు ఇచ్చిన వారితోపాటు డ్యాన్సులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పెషేంట్ల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.