అమెరికాలో నల్లగొండ అమ్మాయి మిస్సింగ్! వాకింగ్ కు వెళ్లి తిరిగి రాలేదు - తల్లిదండ్రుల కన్నీరు!
డైలీ భారత్, బోస్టన్ / నల్లగొండ: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన 23 ఏళ్ల కోయ శ్రీజ రెడ్డి గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో అమెరికాలోని ఆమె స్నేహితులు, స్వగ్రామంలోని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజ.. బోస్టన్ పోలీసుల హై అలర్ట్!
నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన రైతు కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతుల ఏకైక కుమార్తె శ్రీజ రెడ్డి. ఉన్నత విద్యనభ్యసించి జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో ఆమె ఏడాది క్రితం అమెరికా బాట పట్టారు. బోస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో ఎంఎస్ (MS) చదువుతూ, మరో ఎనిమిది మంది తెలుగు విద్యార్థినులతో కలిసి డోర్చెస్టర్ ప్రాంతంలోని ఎడిసన్ గ్రీన్‌లో నివసిస్తున్నారు. మరో ఆరు నెలల్లో విద్యాభ్యాసం పూర్తికానున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
బీచ్ పరిసరాల్లో చివరి లొకేషన్:
భారత కాలమానం ప్రకారం నవంబర్ 2వ తేదీ రాత్రి సుమారు 9:45 గంటల సమయంలో శ్రీజ తన స్నేహితులకు వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి గది నుండి బయటకు వెళ్లారు. అయితే, ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు నవంబర్ 3న బోస్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవంబర్ 4న అధికారికంగా 'మిస్సింగ్ పర్సన్ అలర్ట్' జారీ చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీజ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆమె చివరి లొకేషన్ సమీపంలోని కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ పరిసరాల్లో చూపించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.. రంగంలోకి మంత్రి కోమటిరెడ్డి:
ఒక్కగానొక్క కుమార్తె విదేశాల్లో అదృశ్యమైందనే వార్త తెలియడంతో శాబ్దులాపురం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురు ఎక్కడుందో, ఏమైందో తెలియక యాదగిరిరెడ్డి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ క్రమంలో నల్లగొండ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ని శ్రీజ కుటుంబ సభ్యులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి.. అమెరికాలోని భారత ఎంబసీ అధికారులు, కాన్సులేట్ ప్రతినిధులతో ఫోన్ లో మాట్లాడారు. శ్రీజ ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనేలా బోస్టన్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రస్తుతం బోస్టన్ పోలీసులు బీచ్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నారు. అమెరికాలోని తెలుగు సంఘాలు, భారతీయ సమాజం కూడా శ్రీజ ఆచూకీ కోసం పోలీసులకు సహకరిస్తున్నాయి. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు మరియు గ్రామస్థులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.
#డైలీభారత్ #Nalgonda #Boston #Missing #SreejaReddy #DailyBharath