డైలీ భారత్, గుంటూరు జిల్లా: చిలకలూరిపేట పరిధిలోని తిమ్మాపురం అండర్‌పాస్ వద్ద వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురు మహిళలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో సీఐ సుబ్బనాయుడు ప్రాణాలకు తెగించి చూపిన ధైర్యసాహసాలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.
అండర్‌పాస్ వద్ద వరద ఉద్ధృతికి ముగ్గురు మహిళలు చిక్కుకుపోయినట్లు సమాచారం అందుకున్న సీఐ సుబ్బనాయుడు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా, తన నడుముకు తాడు కట్టుకొని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి దూకారు. ఎంతో సాహసంతో ముగ్గురు మహిళలను ఒక్కొక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందిస్తూ, మహిళల ప్రాణాలను కాపాడేందుకు సీఐ సుబ్బనాయుడు ప్రదర్శించిన ధైర్యసాహసాలను అభినందించారు. విధి నిర్వహణలో పోలీసుల అంకితభావం, సాహసం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకొచ్చిన సీఐ సుబ్బనాయుడు సాహసం పోలీసు శాఖలో మానవత్వానికి, సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది.
#డైలీభారత్ #గుంటూరు #చిలకలూరిపేట #CISubbaNaidu #DailyBharath #Guntur