| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దారుణం... ఆస్తి కోసం భర్త, 4 ఏళ్ల కుమారుడిని చంపిన భార్య

దారుణం... ఆస్తి కోసం భర్త, 4 ఏళ్ల కుమారుడిని చంపిన భార్య

డైలీ భారత్, బెంగళూరు:  బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో జరిగిన డబుల్ మర్డర్ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఆస్తి కోసం ఓ భార్య తన భర్తతో పాటు కన్న కుమారుడిని కూడా అతి కిరాతకంగా చంపేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభినందన్ 32, అతని కుమారుడు యదువీర్ 4. నిందితురాలు అభినందన్ భార్య హరిణి 29. 

2021లో అభినందన్, హరిణిలకు వివాహం జరిగింది. వీరికి యదువీర్ ఉన్నాడు. 2024లో హరిణికి స్నాప్‌చాట్ ద్వారా వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన అభినందన్ ఆమెను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.

అభినందన్‌కు బెంగళూరులో కోట్ల విలువైన 3 అంతస్తుల ఇల్లు ఉంది. అతన్ని చంపేస్తే ఆస్తి మొత్తం తమకే వస్తుందని హరిణి, ఆమె ప్రియుడు వినయ్ కలిసి పథకం వేశారు.

హత్య ఎలా జరిగింది?

ఆగస్టు 16 ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే అదునుగా భావించిన హరిణి ఇంట్లోని CCTV కెమెరాలను ఆఫ్ చేసి వినయ్‌ను ఇంటికి రప్పించింది. అర్ధరాత్రి ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న అభినందన్‌పై దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. 

ఆ సమయంలో వచ్చిన శబ్దాలకు యదువీర్ నిద్రలేచాడు. తమ నేరం బయటపడుతుందనే భయంతో కన్న కొడుకు అని కూడా చూడకుండా దిండుతో ముఖం నొక్కి అతన్ని కూడా హతమార్చారు. ఆ తర్వాత ఇంట్లోని రక్తపు మరకలను తుడిచి, బట్టలు ఉతికి సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు.

పోలీసులకు ఎలా చిక్కారు?

సోమవారం ఉదయం ఏమీ తెలియనట్లు హరిణి స్వయంగా పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి భర్త, కొడుకు నిద్రలోనే స్పందించడం లేదని చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అభినందన్ శరీరంపై గాయాలు, ఇద్దరి చెవుల నుంచి రక్తం రావడం గమనించారు. హరిణి ఫోన్‌లో కాల్ హిస్టరీ డిలీట్ చేయడం, ఆమె సమాధానాల్లో అస్థిరత కనిపించడంతో అనుమానంతో విచారించారు. దీంతో హరిణి నేరం ఒప్పుకుంది.

ప్రస్తుతం బెంగళూరు పోలీసులు హరిణి మరియు వినయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనతో 4 ఏళ్ల చిన్నారిని కూడా చంపడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Previous పిఠాపురం AE కుటుంబం గల్లంతు... అల్లుడి హత్య నుంచి కోడలి లేఖ వరకు సాదిక్ పాత్రపై పోలీసుల ఫోకస్
Next రోబోటిక్ సర్జరీతో 2 రోజుల్లో నడక... కామారెడ్డి రైతుకు యశోద ఆసుపత్రిలో కొత్త జీవితం
ADVERTISEMENT