రాజన్న సిరిసిల్ల (డైలీ భారత్): విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించి ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలని, వారి మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఉపాధ్యాయులకు సూచించారు.
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని TRSMA రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు.
విద్యార్థులతో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయం గడిపేది ఉపాధ్యాయులేనని, వారి ప్రవర్తన, ఆలోచనా విధానంలో వచ్చే మార్పులను గమనించి పిల్లలు తమ సమస్యలను పంచుకునేలా పాఠశాలల్లో సురక్షిత వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అని అన్నారు.
సోషల్ మీడియా సమాచారానికి ఉపయోగపడుతున్నా అధిక వినియోగం వల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడకుండా బాధ్యతాయుతంగా వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆపదకర పరిస్థితులను గుర్తించడం, స్పందించడం, ఎవరిని సంప్రదించాలనే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో షీ టీమ్ ఆధ్వర్యంలో గుడ్ టచ్-బ్యాడ్ టచ్, బాలల రక్షణ, సైబర్ భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, TRSMA రాష్ట్ర నాయకులు శివరాత్రి యాదగిరి, రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, డీటీవో శ్రీనివాస్, TRSMA జిల్లా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గౌడ్, కరస్పాండెంట్లు, ఉత్తమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.